అభివృద్ధే ధ్యేయంగా....

by Sridhar Babu |
అభివృద్ధే ధ్యేయంగా....
X

దిశ బ్యూరో, ఖమ్మం : అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రాధాన్యత రంగాల్లో ప్రపంచంతో పోటీపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధికల్పన, సాగునీరు, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నట్లు వెల్లడించారు. రాజుల పాలన నుంచి విముక్తి చేసిన ఉద్యమంలో, సాహిత్య ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలకపాత్ర పోషించిందని అన్నారు.

సాహిత్యం, సాంస్కృతిక ఉద్యమానికి బీజాలు వేసిన, శ్రీకృష్ణ దేవరాయ స్ఫూర్తితో వచ్చిన గ్రంథాలయ ఉద్యమాలతో పాటు మూడవ ఆంధ్ర మహాసభలు ఖమ్మం, మధిర ప్రాంతాల్లో జరిగాయని తెలిపారు. అల్లీనగర్ ప్రాంతానికి చెందిన మహనీయుడు ఒట్టికొండ రామకోటయ్య బాల్యం నుంచి ప్రజా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ముదిగొండ, గోకినేపల్లి, వెంకటాయపాలెం, మధిర, తెల్దారుపల్లి, ఎర్రుపాలెం, రావినూతల, గోవిందాపురం మొదలైన ప్రాంతాలు నిత్యం పోరాట క్షేత్రాలుగా ఉన్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన విరోచిత పోరాటాల ఫలితంగా మన ప్రాంతం రాజుల పాలన నుండి ప్రజాస్వామ్య భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం అయిందని, దీనిని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల నుంచే..

ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు కోటి 79 లక్షలకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. గృహ జ్యోతి ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 57 వేల 995 వినియోగదారులకు ప్రతి నెలా జీరో బిల్లులు జారీ చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం 49 కోట్ల 97 లక్షల సబ్సిడీ చెల్లించినట్టు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేశామని, రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులకు వర్తింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ నియామకాలు పారదర్శకంగా భర్తీ చేస్తున్నామని, ప్రైవేటు సంస్థల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించేందుకు వారి నైపుణ్యాలు పెంపొందించే దిశగా స్కిల్ యూనివర్సిటీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 63 ఐటీఐ కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.

మున్నేరు బాధితులను ఆదుకుంటాం..

మున్నేరు వరదల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేయడంలో జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. వరదల వల్ల ఇల్లు దెబ్బ తిన్న 15 వేల 96 కుటుంబాలకు 16 వేల 500 రూపాయల చొప్పున పంపిణీ చేశామని, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయల పరిహారం, ఆస్తి, పశు నష్టం జరిగిన వాటికి పరిహారాన్ని అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

అనంతరం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed