ఆంజనేయ స్వామా.. మజాకా..!

by Sumithra |
ఆంజనేయ స్వామా.. మజాకా..!
X

దిశ, వైరా : గత ఏడాది వరకు ఖమ్మం ఎఫ్ఏసీ డీఎఫ్ఓ గా, వైరా ఎఫ్డీఓగా బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయ స్వామి అక్రమ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయన జిల్లాలో పనిచేసిన సమయంలో అనేక అవినీతి అక్రమ ఆరోపణలను మూట కట్టుకున్నారు. అయితే ప్రస్తుతం నిజామాబాద్ డీఎఫ్ఓగా పనిచేస్తున్న ఆయన వైరాలో విధులు నిర్వహించిన సమయంలో మత్స్య శాఖలో అక్రమ సభ్యత్వాలు నమోదు చేసి లక్షలాది రూపాయలు దండుకున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 82 మందిని ఆయన సభ్యులుగా చేర్చుకోవడం ఈ విమర్శలకు బలాన్ని చేకూరుస్తుంది. మత్స్యశాఖ కమిషనర్ అనుమతి లేకుండా, జీవో ఎంఎస్ నెంబర్ 98 లో పేర్కొన్న 30 కులాలకు సంబంధంలేని కులాల వారికి సభ్యత్వాలు ఇవ్వటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే సదరు అధికారి కొణిజర్ల మండలం కోమట్ల గూడెం సొసైటీలో 82 మందిని సభ్యులుగా చేరుస్తూ తనకు తానే ఆర్డర్ కాపీ మంజూరు చేయటం విశేషం.

అక్రమ సభ్యత్వాల నమోదు ఎలా చేశారంటే..

వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం కోమట్లగూడెం మత్స్య పారిశ్రామిక శాఖ సంఘంలో అక్రమ సభ్యత్వాల బాగోతం ఆలస్యంగా బహిర్గతమైంది. ఈ మత్స్య సంఘంలో పెద్ద మునగాల పెద్ద చెరువు, పెద్దగోపతి పాన్ చెరువు, చిన్నగోపతి రాళ్లచెరువు, సీతారాంపురం ఊర చెరువు, చింతకాని మండలం నాగిలి గొండ ఊర చెరువుల్లో చేపల వేట చేసే 590 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. అయితే గత ఏడాది అప్పటి ఖమ్మం డీఎఫ్ఓ, వైరా ఎఫ్డీఓగా పనిచేసిన ఆంజనేయస్వామి నిబంధనలకు విరుద్దంగా 82 మందికి సభ్యత్వాలు నమోదు చేసి తానే ఆర్డర్ కాపీ మంజూరు చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 98 నిబంధన ప్రకారం ఆ జీవోలో ఉన్న 30 కులాల వారికే సభ్యత్వాన్ని నమోదు చేయాలి.

అంతే కాకుండా నూతన సభ్యులను నమోదు చేయాలంటే ముందుగా స్క్రీనింగ్ కమిటీ విసురు వల వేయుట, ఈత కొట్టుట, వల అల్లుట, తెప్ప నడపడం వంటి పరీక్షలు చేయాలి. అనంతరం ప్రతిపాదన తయారు చేసి సభ్యత్వ నమోదు అప్రూవల్ కోసం రాష్ట్ర కమిషనర్ కు ప్రతిపాదనను పంపాలి. అయితే ఇలాంటి పద్ధతులు ఏమీ లేకుండానే నేరుగా ఆంజనేయస్వామి 82 సభ్యత్వాలు ఇచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 98 లో లేని కులాల వారికి సభ్యత్వాలు ఇవ్వటం విశేషం. సభ్యత్వాలు పొందిన వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకపోగా వారిని సభ్యులుగా చేర్చుకునేందుకు రాష్ట్ర కమిషనర్ అనుమతిని కూడా సదరు అధికారి తీసుకోలేదు. తానే స్వయంగా 82 మందికి సభ్యత్వాలు ఇచ్చినట్లు ఆర్డర్ కాపీ మంజూరు చేయటం వ్యవస్థ దిగజారుడుతనానికి అర్థం పడుతుంది. అనేక నిబంధనలను ఉల్లంఘించి సభ్యత్వాలు నమోదు చేసిన అధికారి పై కనీస చర్యలు తీసుకునే వారు కరువయ్యారు.

లక్షలాది రూపాయల అక్రమ వసూళ్లు..

నిబంధనలకు విరుద్ధంగా కోమట్ల గూడెం మత్స్య సొసైటీలో సభ్యులను చేర్చుకునేందుకు లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కో సభ్యుడు వద్ద 10 వేల రూపాయలను వసూలు చేసి సభ్యత్వం ఇచ్చినట్లు ఆ సొసైటీలో మత్స్యకారులే చర్చించుకుంటున్నారు. ఇలా 82 మంది వద్ద సుమారు 8.20 లక్షల రూపాయలను అక్రమంగా వసూలు చేసినట్లు బహిర్గత మవుతుంది. రాష్ట్ర మత్స్యశాఖ వ్యవస్థనే మేనేజ్ చేసే సత్తాతనకు ఉందనే ధీమాతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ సభ్యత్వాలను అధికారి నమోదు చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారం పై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed