Ai tools: లోక్‌సభలో ఏఐ.. త్వరలోనే అందుబాటులోకి !

by vinod kumar |
Ai tools: లోక్‌సభలో ఏఐ.. త్వరలోనే అందుబాటులోకి !
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) వినియోగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ భాషల్లో పార్లమెంటరీ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఎంపీల పార్లమెంట్ రికార్డులను నమోదు చేయడానికి సహాయపడే ఏఐ చాట్ బాట్‌ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే మంగళవారం స్పీకర్ ఓం బిర్లా (Om Birla), కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vaishnaw) సమక్షంలో పార్లమెంట్‌లో ఏఐ సొల్యూషన్ కోసం లోక్‌సభ సెక్రటేరియట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ‘సంసద్ భాషిణి’ పేరుతో ఏఐని అభివృద్ధి చేయనుండగా పార్లమెంటరీ డేటా రికార్డు చేసేందుకు, అనువాద సామర్థ్యాలు, ఇతర సాంకేతిక నైపుణ్యాన్ని ఇది అందించనుంది. ఈ చొరవ అత్యాధునిక ఏఐ పరిష్కారాల ద్వారా పార్లమెంటరీ ప్రక్రియలను మారుస్తుందని అశ్వినీ వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సంసద్ భాషిణి’ బహుభాషా సౌలభ్యాన్ని పెంచుతుందని, సభా డాక్యుమెంటేషన్‌ను క్రమబద్ధీకరిస్తుందని, సాంకేతికత ఆధారిత పాలనలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.

లోక్‌సభ సెక్రటేరియట్ తరపున లోక్‌సభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గౌరవ్ గోయల్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ‘సంసద్ భాషిణి’ చొరవ పార్లమెంటు సంబంధిత పనులను సజావుగా నిర్వహించడానికి, సభ్యులకు బహుళ భాషల్లో ఒకేసారి కార్యకలాపాలను అందుబాటులో ఉంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పార్లమెంటు సభ్యులు, పరిశోధకులు, విద్యావేత్తలు ఏ భాషలోనైనా పార్లమెంటు చర్చల అనువాదాన్ని సులభంగా పొందగలుగుతారు’ అని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

Next Story