‘అవసరమైతే క్రిమినల్ కేసులు’.. జస్టిస్ పీసీ ఘోష్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
‘అవసరమైతే క్రిమినల్ కేసులు’.. జస్టిస్ పీసీ ఘోష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో కీలకమైన మూడు బ్యారేజీలకు సంబంధించి ఇంజినీర్లు, అధికారుల నుంచి వివరాలను సేకరిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్.. ఈ నెల 25వ తేదీలోగా అఫిడవిట్లను సమర్పించాలని డెడ్‌లైన్ విధించింది. వీటిని నిర్మించిన నిర్మాణ సంస్థలకూ త్వరలో నోటీసులు జారీ చేసి వారిని విచారణకు పిలవనున్నది. ఎంక్వయిరీకి హాజరై చెప్పన విషయాలనే రాతపూర్వకంగా అఫిడవిట్‌లో పొందుపరిస్తే అవి రికార్డుగా ఉంటాయని వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు వేర్వేరు సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఇవి లేకుండా పక్కాగా పనిచేసి ఉంటే ప్రజలకు ప్రయోజనం లభించి ఉండేదన్నారు. ఈ సమస్యల కారణంగా ఈ బ్యారేజీలతో ఉపయోగం లేదనే భావనే ఏర్పడిందని జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు.

ఎలాగూ కమిషన్ ముందు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వెల్లడించిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించినందున తప్పుడు వివరాలను సమర్పిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ చర్యలనూ నమోదు చేయాల్సి వస్తుందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. మూడు బ్యారేజీలను ఫిజికల్‌గా సందర్శించి తీవ్రతను గమనంలోకి తీసుకున్న కమిషన్... ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలను, టెక్నికల్ అంశాలను అధ్యయనం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ చేసిన అప్పీల్‌కు అనుగుణంగా నష్టపరిహారం అందుకోవాల్సిన బాధితులతో పాటు వ్యక్తులు, నిపుణులు, సంస్థల నుంచి 54 కంప్లైంట్స్ వచ్చాయని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. వీటిని అధ్యయనం చేసిన తర్వాత వారిని పిలిచి అభిప్రాయాలను తీసుకుంటున్నామని తెలిపారు. మూడు బ్యారేజీల నిర్మాణంతో సంబంధం ఉన్న ఇంజినీర్లు, అధికారులను కూడా పిలిచామని, రెండు రోజుల్లోనే ఇరవై మందిని విచారించామన్నారు.

బ్యారేజీలకు జరిగిన మెకానికల్ డ్యామేజ్ గురించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తూ, దీనికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేస్తున్నామని, ఎవరి ప్రమేయమైనా ఉన్నదా?... ఒకవేళ ఉంటే దానికి కారణాలేంటి?.. ఇలాంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టు సంస్థలు, ఇరిగేషన్ డిపార్టుమెంటు మధ్యన జరిగిన కరస్పాండెన్స్, ఉన్నతాధికారులతో జరిగిన సంప్రదింపులు, ప్రభుత్వం నుంచి జారీ అయిన ఆదేశాలు, వాటిని ఎగ్జిక్యూట్ చేసే సమయంలో తలెత్తిన సమస్యలు.. తదితరాలన్నింటిపై అటు ఇంజినీర్లు, అధికారులతో పాటు ఇటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ చర్చిస్తున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. మేడిగడ్డ. అన్నారం బ్యారేజీలకు ప్రారంభోత్సవం జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికారులు చెప్పడంతో, వాటికి చేసిన మరమ్మత్తు పనులపైనా ఆయన ఆరా తీశారు. ఆశించిన స్థాయిలో, అవసరమైన మేరకు ఎందుకు రిపేర్లు చేయలేదని నిలదీసిన ఆయన... ఇంజినీర్లు, అధికారుల నుంచి వివరాలను రాబట్టింది.

వ్యక్తులు, నిపుణులు, ఏజెన్సీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో నిర్దిష్టంగా అధికారులను వేలెత్తి చూపే లాంటి అంశాలు ఉన్నట్లయితే నిర్ధారణ చేసుకోడానికి ఆ అధికారులు, ఇంజినీర్లకు కూడా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామన్నారు. నిజంగా ఈ బ్యారేజీలు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసినట్లయితే ప్రజలకు లాభం జరిగి ఉండేదని, కానీ ఎక్కడో ఏదో తప్పుల వల్లనే, అంచనాలు తారుమారైనందువల్లనే ఇలా జరిగి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ విచారణ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత స్పష్టతకు రాగలుగుతామన్నారు.

Advertisement

Next Story

Most Viewed