ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక విచారణలు..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-24 12:13:06.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక విచారణలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌ల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో అభిషేక్, విజయ్ నాయర్‌ను ఈడీ హాజరుపరచనుంది. సీబీఐ విచారణ ముగియడంతో ఆ కేసులో ఇరువురికి ఇప్పటికే ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మద్యం కుంభకోణంలో చోటు చేసుకున్న మనీలాండరింగ్ వ్యవహారాలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో నవంబర్ 14 నుంచి వీరిద్దరిని ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి కోర్టు విధించిన ఈడీ కస్టడీ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో అభిషేక్, విజయ్ నాయర్‌లను కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని ఈడీ తమ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది.

ప్రభుత్వంలోని పెద్దలకు రూ. 100 కోట్లు అడ్వాన్స్‌లను విజయన్ నాయర్ చెల్లించారని ఇతనితో కలిసి అభిషేక్ లంచాలు ఇచ్చినట్టు పేర్కొంది. హోల్ సేలర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు పంచిపెట్టినట్టు రిపోర్టులో ప్రస్తావించింది. ఇక ఈడీ కస్టడీ కొనసాగించే విషయంపై విచారణ సమయంలోనే శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు‌ల బెయిల్ పిటిషన్లపై కూడా ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. ఇదే కేసులో ఈనెల 10న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను ఈడీ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు 21 నవంబర్‌న ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను తీహార్ జైల్లో ఉంచారు. మరోవైపు కేసులో కీలక సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ రద్దు చేస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed