తెలంగాణలో సోనియా గాంధీ పోటీ.. పీఏసీలో తీర్మానం

by GSrikanth |   ( Updated:2023-12-18 11:26:09.0  )
తెలంగాణలో సోనియా గాంధీ పోటీ.. పీఏసీలో తీర్మానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. పీఏసీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలని పీఏసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. దివంగత నేత ఇందిరాగాంధీ గతంలో మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తుచేశారు. ఆరు గ్యారంటీల విషయంపై పీఏసీలో చర్చ చేశామని చెప్పారు.

ఆరు గ్యారంటీల్లో రెండు పూర్తి చేశామన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో సీఎం ఆరు గ్యారంటీలపై నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. ఈ నెల28న నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంతో ఘోరంగా ఉందని ఆ విషయంపై చర్చ జరిగిందన్నారు. ఎల్లుండి అసెంబ్లీలో ఫైనాన్స్ పొజిషన్, తెలంగాణ అప్పుల వివరాలు ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క ప్రవేశాపెట్టబోతున్నారని చెప్పారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకల గురించి, ఒక్క కాళేశ్వరం మీద 85 నుంచి 90 వేల కోట్లు ఖర్చుపెట్టి కనీసం 90 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు.

ప్రాజెక్టుల అవకతవకల అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇరిగేషన్, ఎనర్జీ, ఫైనాన్స్ అవకతవకలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఎనర్జీ విషయంలో కూడా రూ.80 కోట్ల వరకు అప్పులు చేశారని తెలిపారు. మిషన్ భగీరథలో అవకతవకలపై కూడా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కేసీఆర్ అహంకారం వల్ల రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని మండిపడ్డారు. రేషన్ కార్డులు, ఆసర పెన్షన్ లాంటి వాటిపై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed