Jagadish Reddy: అప్పులు చేసిన మాట వాస్తవమే.. సమాధానం చెప్పడానికి కేసీఆర్ అక్కర్లేదు

by Gantepaka Srikanth |
Jagadish Reddy: అప్పులు చేసిన మాట వాస్తవమే.. సమాధానం చెప్పడానికి కేసీఆర్ అక్కర్లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ శాఖపై వాడివేడి చర్చ జరుగుతోంది. ముందుగా విద్యుత్ శాఖపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చ ప్రారంభించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా అప్పులు చేసి విద్యుత్ సంస్థను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ చేసిన పాపాలు చెప్పాలంటే రోజులు సరిపోవని.. పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి స్పందించారు. 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చి నవంబర్ నాటికి 24 గంటల కరెంట్ ఇచ్చామని అన్నారు.

రైతులకు 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వట్లేదని మంత్రిగా ఉండి ప్రశ్నించానని గుర్తుచేశారు. ఆరోజు రాష్ట్రంలో విద్యుత్ ఉన్నా.. సరఫరాకు లైన్లు, సౌకర్యాలు లేవని అధికారులు చెప్పినట్లు తెలిపారు. దాదాపు రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినట్లు చెప్పారు. వినియోగం ఆధారంగానే విభజన సమయంలో రాష్ట్రానికి విద్యుత్‌ను కేటాయించారని అన్నారు. తమ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని వెల్లడించారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని అన్నారు. అప్పులు చేస్తున్నామని ఆనాడే స్వయంగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని గుర్తుచేశారు. తరచూ తాము అప్పులు చేశామని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed