ఆ విషయం కేసీఆర్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు: KTR

by GSrikanth |
ఆ విషయం కేసీఆర్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యధిక జ‌నాభా ఉన్న మ‌న దేశంలో వైద్య ఖ‌ర్చులు భారీగా పెరిగిపోతున్నాయ‌ని, వ్యాపార కోణంలో ఇది మంచి అవ‌కాశ‌మే అయిన‌ప్పటికీ కేవ‌లం లాభాల కోస‌మే ప‌ని చేయొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. హైద‌రాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి హాస్పిట‌ల్‌లో శనివారం నిర్వహించిన స్టార్టప్ ఛాలెంజ్ ఫినాలె-2023 కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పాశ్చాత్య దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో వ్యవ‌స్థాప‌కులుగా మార‌డం అంత సులువు కాదని, వ్యాపారవేత్తల‌కు కావాల్సిన సౌక‌ర్యాల‌ను రాష్ట్ర ప్రభుత్వం క‌ల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావ‌ర‌ణం ఉందని, కొత్త సాంకేతిక‌త గురించి చెప్పిన‌ప్పుడు సీఎం కేసీఆర్ ఎప్పుడు గుర్తు చేస్తుంటారన్నారు. ఆ సాంకేతిక‌త స‌మాజంపై ఎంత ప్రభావం చూపిస్తుంది... స‌మాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందా? అని అడుగుతారన్నారు. గ‌తంలో మూల‌ధ‌నం సంపాదించాలంటే స‌వాల్‌గా ఉండేదని, డ‌బ్బును స‌మ‌కూర్చుకుని, ఆ త‌ర్వాత ఆలోచ‌న‌ను అమ‌లు చేయాల్సి వ‌చ్చేదన్నారు.

ఇప్పుడు ఆలోచ‌నే ముఖ్యం.. ఆ త‌ర్వాతే మూల‌ధ‌నం అని పేర్కొన్నారు. ఎంత తొంద‌ర‌గా మార్కెట్‌లోకి వ‌స్తామ‌నేది ముఖ్యం కాదని, ఒరిజిన‌ల్‌గా ఉండండి అని సూచించారు. కొత్త వ్యవ‌స్థాప‌కుల‌కు ఒరిజిన‌ల్‌గా ఉండండి.. కాపీ చేయొద్దని, అమెజాన్‌ను చూసి ప్లిఫ్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటివి సృష్టించ‌వచ్చు ఇది చాలా సుల‌భం అన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే సృష్టించిన‌వి కావు.. ప్రపంచ స్థాయికి చేరేలా కొత్త ఆవిష్కర‌ణ‌లు చేయాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికిప్పుడే వ్యవ‌స్థాప‌కులుగా మార‌క‌పోవ‌చ్చు కాని సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం మూల‌ధ‌నం స‌మ‌స్య కాదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ చైర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed