ఆస‌రా పింఛ‌న్ పేరిట కేసీఆర్ కొత్త నాట‌కం: Vijaya Shanthi

by Nagaya |   ( Updated:2022-08-25 13:44:09.0  )
BJP Leader Vijaya Shanthi Criticizes CM KCR
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేసీఆర్ స‌ర్కార్ ఆస‌రా పింఛ‌న్లను అడ్డుపెట్టుకొని కొత్త నాట‌కం షూరూ చేశారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. ఆసరా పింఛన్‌ల నిధులు రిలీజ్‌ అయ్యాయని కానీ, ఆగస్టు నెల ముగుస్తున్నా లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు ఆ పైసలు చేతికి అందలేదని అన్నారు. యాదాద్రి జిల్లాలో గత నెల వరకు 83,457 మందికి ఆసరా పింఛన్‌ అందేదని, ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు మంజూరు చేయడంతో ఇప్పుడు కొత్తగా 24,976 మందిని గుర్తించారని, దీంతో జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 1,08,433కు చేరిందని పేర్కొన్నారు. వీరికి పంపిణీ చేసేందుకు రూ.25 కోట్లు కూడా విడుదల అయినా.. పింఛన్ల పంపిణీ మాత్రం ఇంకా స్టార్ట్‌ కాలేదని తెలిపారు.

అయితే, కొత్త పింఛన్‌దారులకు కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు కొత్తవారితో పాటు, పాతవారికి కూడా పైసలు ఇవ్వొద్దని ఆఫీసర్లకు ఇంటర్నల్‌గా ఆదేశాలు అందాయని ఆమె ఆరోపించారు. ఇది విన‌డానికే వింత‌గా ఉందని విజయశాంతి సెటైర్లు వేశారు. కొత్తవారికి, పాత‌వారికి లింక్ ఏంటో కేసీఆర్ సారుకే తెలియాలని ఎద్దేవా చేశారు. కొత్తగా పింఛన్లు మంజూరైనా.. వారికి ఆసరా గుర్తింపు కార్డు ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అప్పగించిందని, ఇన్నాళ్లూ అభివృద్ధి పనుల విషయంలో వెనుకబడి.. ప్రజల వద్దకు వెళ్లడానికి ముఖం చెల్లని ఈ లీడర్లు ఆసరా పింఛన్‌‌ గుర్తింపు కార్డుల పంపిణీని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు రోజుకో ఊరిలో లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తూ పబ్లిక్‌లో ఇమేజ్‌ పెంచుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు. దీంతో జిల్లాలో ఆసరా కార్డుల పంపిణీ మరింత ఆలస్యం అవుతోందని..'కేసీఆర్ నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజానీకం నీ పాలనకు త్వరలోనే తెరవేయడం ఖాయం' అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.


Advertisement

Next Story