- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు జిల్లాలపై KCR స్పెషల్ ఫోకస్.. ఇద్దరు కీలక నేతలకు ఝలక్ ఇచ్చేందుకు నేరుగా రంగంలోకి CM..!
దిశ, తెలంగాణ బ్యూరో: హ్యాట్రిక్ కోసం ఆరాటపడుతున్న అధికార పార్టీ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నది. బీఆర్ఎస్‌ను సవాలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఢీకొట్టడానికి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లపై ఫోకస్ పెట్టింది.
ఆ ఇద్దరు నేతలను ఇరుకున పెట్టడానికి, వారికి బలమున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో పైచేయి సాధించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. గెలుపు అనుమానం అనే అభిప్రాయం (సర్వే రిపోర్టులో) వచ్చిన స్థానాల్లో భారీ స్థాయి బహిరంగసభలను పెట్టాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో కనీసంగా ఆరు స్థానాలను, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 స్థానాలను గెలవడమే బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ జిల్లాల్లో బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నదనుకునే నియోజకవర్గాల్లో పబ్లిక్ మీటింగుల నిర్వహణపై కేసీఆర్ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాలకు కలిపి ఒక చోట పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఈసారి మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలనుకునే స్థానాల్లో, పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయనుకునే చోట ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలిపాయి.
ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లోనూ బీఆర్ఎస్ గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. ఇందుకోసం ఈ రెండు జిల్లాల్లో పార్టీని గెలిపించుకోడానికి కేసీఆర్ బాధ్యతలు తీసుకుని నేరుగా ఆయనే రంగంలోకి దిగాలనుకుంటున్నారు.
సవాలుగా మారిన ఖమ్మం జిల్లా :
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఎనిమిది స్థానాలనూ నిలుపుకోవడం మాత్రమే కాక మిగిలిన రెండింటిలోనూ పాగా వేయాలనుకుంటున్నది. మరోవైపు కనీస స్థాయిలో అర డజను సీట్లనైనా గెల్చుకోవాలనుకుంటున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు వ్యక్తిగతంగా సవాలు విసురుతున్నందున ఆ ప్రభావం లేకుండా చేయడం కోసం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇప్పటికే పార్టీ తరఫున ఇద్దరు సీనియర్ నేతలు జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఫీల్డ్ లెవల్ స్టడీ చేసి రిపోర్టును కేసీఆర్‌కు అందించారు. ఎక్కడెక్కడ పార్టీ వీక్‌గా ఉన్నది, ప్రత్యర్థి పార్టీకి ఉన్న బలమెంత, ఎలాంటి చర్యలు తీసుకుంటే బలోపేతం కావచ్చు, కచ్చితంగా గెలుస్తామనే పరిస్థితి రావాలంటే ఏం చేయాలి తదితరాలన్నింటిపై కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నారు.
ఈ జిల్లాలోని ప్రతీ సెగ్మెంట్ కీలకం కావడంతో స్వయంగా ఆయనే ప్రచారంలోకి దూకి అన్ని సెగ్మెంట్లలో భారీ బహిరంగ సభలను పెట్టి ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు (ఖమ్మం-పువ్వాడ అజయ్)ను మాత్రమే గెల్చుకోగా నలుగురు కాంగ్రెస్, ఇద్దరు తెలుగుదేశం పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను, వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్‌ను చేర్చుకున్నది.
ఇప్పటికీ రెండు స్థానాలు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్న మొత్తం ఎనిమిది స్థానాలతో పాటు మిగిలిన రెండు కాంగ్రెస్ సీట్లను కూడా గెల్చుకుని తెలంగాణలో ఆ పార్టీని, వ్యక్తిగతంగా పొంగులేటిని కార్నర్ చేయాలనుకుంటున్నారు.
రేవంత్‌ను కట్టడి చేసేందుకు..:
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అక్కడే ఆయనను నిలువరించాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడించినట్లుగానే ఈసారి జిల్లా మొత్తం మీద ఆయనకు ప్రజాదరణ లేదని నిరూపించేలా మొత్తం 14 స్థానాల్లోనూ బీఆర్ఎస్ గెలిచేలా ప్రత్యేక వ్యూహాన్ని కేసీఆర్ రూపొందిస్తున్నారు.
పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ తన సొంత జిల్లాలోని స్థానాలనే గెలిపించుకోలకేపోయారనే మెసేజ్‌ను ప్రజల్లోకి పంపాలనుకుంటున్నారు. దీనికి తోడు మాజీ మంత్రి డీకే అరుణకు గద్వాల సెగ్మెంట్‌లో ఇప్పటికీ ఒక మేరకు పట్టు ఉన్నందున గత ఎన్నికల్లో ఓడించినట్లుగానే ఈసారి కూడా బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో భారీ సభలు పెట్టి ఓటర్లను ప్రభావితం చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
పాలమూరు ప్రాజెక్టును ఈ సభల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగించుకోవాలన్నది ప్లాన్. ఇటీవల పర్యావరణ అనుమతులకు వచ్చిన సిఫారసులను హైలైట్ చేసే ఆలోచన ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు గతంలో కోర్టుల్లో వేసిన కేసులను ప్రస్తావించి జనంలో దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లో సైతం ఇలాంటి వీక్ సెగ్మెంట్లో కేసీఆర్ బహిరంగసభలు పెట్టి మిగిలిన చోట్ల కేటీఆర్, హరీశ్‌రావులతో పబ్లిక్ మీటింగ్స్ పెట్టించాలని పార్టీ భావిస్తున్నది.
తొలి జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాలవారీగా ప్రచార సభలను ఫిక్స్ చేసే టైమ్ నాటికి ఈ షెడ్యూలు కొలిక్కి రానున్నది. వీక్ సెగ్మెంట్లలో స్వయంగా కేసీఆర్ ప్రచారంలోకి దిగడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈసారి అభ్యర్థుల మార్పుపై కూడా ఆలోచనలు జరుగుతున్నాయి.