KCR: కొత్త ఏడాదిలో కేసీఆర్ రీ ఎంట్రీ.. కాంగ్రెస్ పై ఖతర్నాక్ వ్యూహంతో

by Prasad Jukanti |   ( Updated:2024-11-15 13:27:54.0  )
KCR: కొత్త ఏడాదిలో కేసీఆర్ రీ ఎంట్రీ.. కాంగ్రెస్ పై ఖతర్నాక్ వ్యూహంతో
X

దిశ, డైనమిక్ బ్యూరో : కొత్త ఏడాదిలో తెలంగాణ పాలిటిక్స్ మరింత రంజుగా మారబోతున్నాయా? సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కార్ కొలువుదీరి డిసెంబర్ 9తో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ఇన్నాళ్లు సైలెంట్ మోడ్‌లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్‌ యాక్టివ్ కాబోతున్నారా? అంటే.. తాజాగా బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. పదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ను మరింతగా ఇరుకున పెట్టేలా అధికారపక్షం వరుసగా ఎటాక్ చేస్తుండగా డిఫెన్స్ చేసేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలే చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌లో జోష్ నింపేందుకు అధినేత కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ కేటీఆర్, హరీశ్‌రావులే..

ఈ తొమ్మిదిన్నర నెలల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఏ మాత్రం అవకాశం దొరికినా ఎటాక్ చేస్తూనే ఉన్నారు. గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపుతూనే వారి హయాంలో నిర్లక్ష్యానికి గురైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్థులు వరుస ఎటాక్స్‌తో ఇరుకున పెడుతున్నా, అసెంబ్లీకి రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అని నిలదీస్తున్నా కేసీఆర్ మాత్రం మౌనం వీడలేకపోయారు. అడపాదడపా ప్రకటనలకే పరిమితమయ్యారే తప్ప తమపై వస్తున్న ఆరోపణలపై నేరుగా ప్రజల్లోకి వచ్చి ఖండించలేకపోయారు. ఈ ప్రభుత్వానికి తాము సరిపోతామని కేసీఆర్ ఎందుకు అంటూ కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) చెబుతూ కేడర్‌ను నడిపిస్తూ వస్తున్నారు. కానీ ఇన్నాళ్లు మౌనం వహించిన కేసీఆర్ ఇక విజృంభించబోతున్నట్లు కేటీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. కేసీఆర్ మౌనాన్ని కూడా ఈ ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని 2025లో ఆయన మౌనం బ్రేక్ అవుతుందని వెల్లడించారు. తమనే తట్టుకోలేక పోతున్నారని, ఇక కేసీఆర్ వస్తే ఈ సర్కార్ పరిస్థితి ఏంటని కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ వర్సెస్ కేసీఆర్?..

నిజానికి కేసీఆర్ మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందనే చర్చ చాలాకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రేవంత్ సర్కార్‌కు ఏడాది సమయం ఇవ్వాలన్న భావనతో ఉన్నామని కేసీఆర్ గతంలో చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఏడాదిలో యాక్షన్‌లోకి దిగబోతున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్లు హరీశ్‌రావు, కేటీఆర్ ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బీఆర్ఎస్.. ఇక కేసీఆర్ ఎంట్రీతో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి గల తేడాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి గులా బీబాస్ జనంలోకి వస్తే రేవంత్ వర్సెస్ కేసీఆర్ మధ్య రాజకీయం ఎలా ఉండబోతున్నదనేది మరింత ఆసక్తిని రేపుతున్నది.

Advertisement

Next Story