- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గనుల వేలానికి తెరలేపింది KCR.. సర్కారు ఆరా తీయడంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల గనుల వేలం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని 11 గనులను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులోని ఆరింటిని ఈ నెల 30 లోగా కంప్లీట్ చేయాలంటూ కేంద్ర బొగ్గు, మైనింగ్ గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కానీ కేంద్రం నోటిఫై చేయడానికి ముందు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే కేంద్రానికి వేలం ప్రతిపాదనలు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
2018 లోనే కేంద్రానికి లేఖ
సూర్యాపేట జిల్లాలోని పసుపులబోడు, సైదులనామా, సుల్తాన్‌పూర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్న సున్నపురాయి (లైమ్ స్టోన్) గనులను వేలం వేయడానికి 2018 అక్టోబరు 5న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొదటగా లేఖ రాసింది. ఇందుకు అవసరమైన ముందస్తు అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరింది. పర్యావరణ సంబంధ అంశాలతో ముడిపడి ఉన్నందున కేంద్రం పర్మిషన్ కోసం రిక్వెస్టు చేసింది. ఆశించిన తీరులో కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో 2019 అక్టోబర్ 29న కేంద్ర ప్రభుత్వానికి ఫస్ట్ రిమైండర్ పంపింది. అయినప్పటికీ రిప్లయ్ రాకపోవడంతో 2020 సెప్టెంబరు 16న మరోసారి రిమైండర్‌ను రాసింది.
వేలం ద్వారానే ఈ మూడు గనులను కేటాయించడటానికి (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్‌మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 10-బీ-2 ప్రకారం కాంపొజిట్ లైసెన్స్ జారీకి వీలుగా) వీలైనంత తొందరగా అనుమతి మంజూరు చేయాలని ఆ రిమైండర్‌లో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి చీఫ్ సెక్రటరీ, మైనింగ్ శాఖ బాధ్యతలు (ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో) చూస్తున్నందున కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి వివరణతో కూడిన లేఖలు రాశారు. ఖమ్మం జిల్లాలోని చింతలతండా, ఆదిలాబాద్ జిల్లాలోని కంప జునపాని సున్నపురాయి గనులను సైతం వేలం వేయడానికి ముందస్తు అప్రూవల్ ఇవ్వాల్సిందిగా మరో లేఖలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహం
కేంద్ర ప్రభుత్వం గనుల వేలానికి మైన్స్-మినరల్స్ చట్టానికి సవరణలు చేయగా.. అంత కన్నా వేగంగా నాటి రాష్ట్ర ప్రభుత్వమే ఉత్సాహం చూపిందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం చొరవ తీసుకోవడంతో కేంద్రం సైతం చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న 11 గనులను వేలం వేయడానికి వీలుగా నోటిఫై చేసింది. ఆనాడు కేసీఆర్ సర్కారు దానిని వ్యతిరేకించి ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవని, కానీ కేంద్రం స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోడానికి ముందు రాష్ట్రమే చొరవ తీసుకోవడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. గనుల శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ శాఖ అధికారులతో నిర్వహించిన తొలి నిర్వహించిన రివ్యూలో తెలంగాణకు సంబంధించిన 11 గనులను నోటిఫై చేసిన అంశం ప్రస్తావనకు రావడంతో ఇకనైనా జాప్యం లేకుండా వేలం నిర్వహించాలన్న నిర్ణయం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా..
నోటిఫై చేసిన 11 గనుల్లో కనీసం ఆరింటికైనా ఈ నెల 30వ తేదీలోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 16న కేంద్ర గనుల శాఖ నుంచి రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంత తక్కువ డెడ్‌లైన్‌తో కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనే కోణం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆరాతీసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన తాజా ఉత్తర్వుల అనంతరం వేలం ప్రక్రియను ఆపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంలేదంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అప్పటి వాస్తవం వెలుగులోకి రావడం గమనార్హం. గనుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, స్పష్టమైన నిర్ణయం తీసుకున్నదీ రాష్ట్ర ప్రభుత్వమే అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు అత్యుత్సాహం ప్రదర్శించినందునే కేంద్రం ఈ గనులను నోటిఫై చేయడంతో పాటు ఇప్పుడు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ డెడ్‌లైన్ విధించాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బయటపడడంతో దానికి ప్రత్యామ్నాయం ఏంటనేది ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని ఖనిజ సంపదను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందనే ఆరోపణలకు ఈ అంశాలు బలం చేకూరినట్లయింది. ఖనిజ సంపదను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకే అప్పట్లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది బహిర్గతమైంది.
నాలుగు బ్లాక్‌కు వేలానికి 2023లోనే నిర్ణయం
సింగరేణికి దక్కాల్సిన సత్తుపల్లి, కొయ్యలగూడెం, కల్యాణ్‌ఖని, శ్రావణ్‌పల్లి బ్లాక్‌లను వేలం వేయడానికి 2023లోనే నిర్ణయం జరిగింది. మొదటి రెండు బ్లాకులకు ఫస్ట్ టైమ్ ఏ ప్రైవేటు కంపెనీ ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ఆగిపోయింది. రెండోసారి నిర్వహించిన ఆక్షన్‌లో కేవలం ఒక్కో కంపెనీ మాత్రమే ముందుకు రావడంతో నిబంధనల ప్రకారం అప్పుడూ పెండింగ్‌లో పడింది. మూడోసారి వేలంలో ఆ రెండు గనులు ‘ఆరో’, అవంతిక అనే కంపెనీలకు దక్కాయి. శ్రావణ్‌పల్లికి ఇప్పటికీ ఏ ప్రైవేటు కంపెనీ ముందుకు రాకపోవడంతో కిషన్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్ వేదికగా పదో విడత వేలం ప్రక్రియను తాజాగా లాంచ్ చేశారు. దీనికి తోడు భూపాలపల్లి ఏరియాలోని తాడిచెర్ల బొగ్గు గనిని అప్పటికే గత ప్రభుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి 30 ఏండ్ల పాటు లీజుకిచ్చేసింది. అదే తరహాలో సున్నపురాయి, ఐరన్ ఓర్ గనులను సైతం ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు 2018లోనే నాటి సర్కారు ఫైళ్లు కదిపింది.
లైమ్‌స్టోన్ గనుల వేలానికి 2021లో అనుమతి
సూర్యాపేట జిల్లాలోని మూడు లైమ్‌స్టోన్ గనులను వేలం వేసే సన్నాహాల్లో భాగంగా 2020 సెప్టెంబర్ 16న నాటి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర గనులు, ఖనిజాల శాఖ సెక్రటరీకి లేఖ రాసింది. ఫస్ట్ లెటర్, దానికి కొనసాగింపుగా రెండు రిమైండర్‌ల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న మూడు లైమ్‌స్టోన్ గనులను వేలం వేసి లీజుకు ఇచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వమే సమ్మతించినందున కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని, వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చని అందులో స్పష్టం చేసింది. అందులో భాగంగానే అప్పుట్లో కేంద్రం నోటిఫై చేసిన గనుల వేలం ప్రక్రియ తాజా స్టేటస్‌పైనా, తెలంగాణలోని 11 గనులపైనా అన్ని రాష్ట్రాల నుంచి ఆరా తీసింది. దానికి కొనసాగింపుగానే వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని గత నెల 20న రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది.
ఖనిజాలను కాపాడిందంటూ గులాబీ లీడర్ల గొప్పలు
కేంద్ర ప్రభుత్వం 2015లో చట్టానికి చేసిన సవరణల అనంతరం దేశవ్యాప్తంగా 354 మేజర్ మినరల్ బ్లాకులను వేలం వేయడానికి నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో 48 బ్లాకుల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. గనుల వేలం విధానం ఆయా రాష్ట్రాలకు ఆదాయం తెచ్చిపెడుతున్నదంటూ కేంద్ర గనుల శాఖ ఈ లేఖలో కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది. తెలంగాణలో కేంద్రం నోటిఫై చేసిన 11 గనులను వేలం వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ నెల 30 లోగా వాటిలో కనీసం ఆరు గనులను వేలం వేయాలని డెడ్‌లైన్ విధించింది.
లేని పక్షంలో మైన్స్-మినెరల్స్ చట్టంలోని సెక్షన్ 10-బి, 11 ప్రకారం కేంద్రమే ఈ గనులను వేలం వేస్తుందని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు తెలంగాణలోని ఖనిజ సంపదను కాపాడిందని, కానీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని ఎదురించలేక రాజీ పడిందంటూ గులాబీ నేతలు ఇటీవల ఆరోపించారు. ఇలాంటి సమయంలో గత ప్రభుత్వమే కేంద్రం కన్నా వేగంగా గనులను ప్రయివేటుకు అప్పజెప్పడంపై అత్యుత్సాహం ప్రదర్శించిందనేది అప్పటి కరస్పాండెన్స్ ద్వారా బట్టబయలైంది. అప్పటి తప్పులను దాచిపెట్టేందుకు ఆ పార్టీ లీడర్లు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగానే కేంద్ర ప్రభుత్వం గనుల వేలంపై ఇప్పుడు పెత్తనం చెలాయిస్తున్నదనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన.
ఆనాడు గనుల వేలానికి ఒప్పుకోకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గనులను ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టే దురాలోచనతో గత ప్రభుత్వం వేలం వేసేందుకు కేంద్రం అనుమతి కోరి, ఇప్పుడు రాజకీయానికి వాడుకోవడం గమనార్హం. కేంద్రం విధించిన గడువు మరో పది రోజుల్లో ముగియనున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ తప్పిదాలతో విలువైన ఖనిజ సంపదపై ఉన్న హక్కును కోల్పోయే ప్రమాదమున్నదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వరంగ సంస్థలకే వీటిని కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది.