సంతోష్‌ను దూరం పెట్టిన కేసీఆర్.. ఫాం హౌస్‌లోకి నో ఎంట్రీ?

by karthikeya |
సంతోష్‌ను దూరం పెట్టిన కేసీఆర్.. ఫాం హౌస్‌లోకి నో ఎంట్రీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జోగినిపల్లి సంతోష్.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఈయన హవా.. మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్‌ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు ఇలా.. ఎవరైనా సరే ఈయన్ను ప్రసన్నం చేసుకోవాల్సి ఉండేది. ఇలా.. ఆనాడు అన్నీ తానై నడిపించిన సంతోష్ ఇప్పుడు ఎక్కడున్నారనే చర్చ షురూ అయ్యింది. కొన్ని రోజులుగా సంతోష్.. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కూ దూరంగానే ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు రెండు దశాబ్దాల పాటు కేసీఆర్‌కు నీడలా నిలిచిన ఆయన ఇప్పుడు అంటీముట్టనట్టు ఎందుకు ఉన్నారు.. ? పెద్దాయనే దూరం పెట్టారా?.. గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది ?.. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనడం లేదు ?.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎందుకు గళం విప్పడం లేదు ? కవిత అరెస్టు మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు ? అటు కేసీఆర్‌కు దూరమై.. ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేని.. అదీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్‌కు పరిమితం కావడం ఏంటీ..? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాలిటిక్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

సేఫ్ డిస్టెన్స్ మెయింటెయిన్

రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను గులాబీ నేతలు విమర్శిస్తున్నా సంతోష్ మాత్రం సేఫ్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలు, రుణమాఫీ, రైతుబంధు, రైతుభరోసా, మహాలక్ష్మి స్కీమ్‌ అమలు, ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులు, బాలింతలు, శిశువులు మృతి చెందుతున్నా, కనీసం మందులు సైతం దొరకడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైడ్రా ఇష్యూ జోరుగా సాగుతున్నది. అయినా సంతోష్ మాత్రం ‘నాకు సంబంధం లేదు’ అన్న తీరులో వ్యవహరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కవిత అరెస్టు ఇష్యూలో నో ఇన్వాల్వ్‌మెంట్

బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ.. సీబీఐ, ఈడీ ద్వారా కవితను అరెస్టు చేయించిందంటూ కేటీఆర్, హరీశ్‌రావు సహా గులాబీ నేతలంతా విమర్శలు చేశారు. అయినా సంతోష్ ఏనాడూ ట్వీట్‌లు, స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు. తిహార్ జైలులో ఉన్న కవితను చూసేందుకు ఫస్ట్ టైం వెళ్లడం మినహా మళ్లీ బెయిల్‌పై రిలీజ్ అయ్యే రోజునే ప్రత్యక్షమయ్యారని గులాబీ లీడర్లు చెబుతున్నారు. అయితే అరెస్టు పరిణామం కవిత, కేటీఆర్‌ను దగ్గర చేయగా.. సంతోష్‌తో మాత్రం ఈ ఇద్దరికీ గ్యాప్ గతంకంటే పెరిగిందనే మాట వినిపిస్తున్నది. మరో వైపు కవిత, కేటీఆర్, హరీశ్‌‌రావు మధ్య రిలేషన్స్ దెబ్బతీసేందుకు సంతోష్ నడిపిన వ్యవహారమే కారణమనే అభిప్రాయాలూ అప్పట్లో వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యేంత వరకూ అటు పార్టీతో, ఇటు కుటుంబ సభ్యులతో కవితకు దూరం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బాధ్యతలు అప్పజెప్పడానికి కూడా నాయకత్వం సంసిద్ధంగా లేదనే గుసగుసలూ వచ్చాయి. కానీ అరెస్టు తర్వాత కేటీఆర్, కవిత, హరీశ్‌రావు మధ్య పూర్వపు సంబంధాలు నెలకొనడంతో పాటు కేసీఆర్‌తో సంతోష్‌కు గ్యాప్ పెరిగిందనే మాటలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. సంతోష్ ఇప్పుడు.. పిలిస్తే తప్ప ఫామ్ హౌజ్‌కు వెళ్లడంలేదని, గతంలో అన్నీ తానై నడిపించిన పరిస్థితులు ఇప్పుడు లేవన్నది పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.

అందుకే దూరం పెట్టారా ?

పదేండ్ల పాటు కేసీఆర్‌ను సొంత పార్టీ నేతలు సైతం కలవనీయకుండా సంతోష్ అడ్డం పడిన వ్యవహారం ఓటమి తర్వాత బహిర్గతమైందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారనేది పార్టీ శ్రేణుల వాదన. సంతోష్‌ పాత్రను పరిమితం చేసిన తర్వాతనే వివిధ స్థాయిల్లోని లీడర్లు సహా కింది స్థాయి శ్రేణులు కేసీఆర్‌ను కలుసుకునే వెసులుబాటు లభించిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైందని తెలుస్తున్నది.

‘గ్రీన్ ఛాలెంజ్’ కే పరిమితంపై చర్చ

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ను కలిసేందుకు సంతోష్ అనుమతి కావాలా? అంటూ కవిత సైతం ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌కు ఆమె దూరం కావడానికి సంతోషే కారణమనే ఆరోపణలూ వచ్చాయి. కేసీఆర్ తర్వాత ఒక ప్రాక్సీ పవర్‌ సెంటర్‌గా చక్రం తిప్పిన జోగినపల్లి సంతోష్ ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు దూరంగా, పార్టీతో సంబంధం లేని గ్రీన్ ఛాలెంజ్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావడం చర్చకు దారి తీస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన అసోం, ఒడిశా రాష్ట్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలపైనే ఆయన ఫోకస్ పెట్టారు. బీజేపీతో రాజకీయ శతృత్వం లేకుండా పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఎవరికీ అర్థంకాని రీతిలో స్నేహ సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నారా?.. రెండేండ్ల క్రితం ఎంపీగా ఉన్న సమయంలో అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులకు ఇన్విటేషన్ పంపి ఢిల్లీలో మొక్కలు నాటే కార్యక్రమంలో కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ రెండు పార్టీలనూ బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులుగా బహిరంగంగా పేర్కొంటున్నా సంతోష్ మాత్రం గ్రీన్ ఛాలెంజ్ పేరుతో వారితో సఖ్యతగా మెలగడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేల ద్వారానే రాజ్యసభ ఎంపీగా ఆరేండ్లు కొనసాగిన సంతోష్.. ఇప్పుడు అదే పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేకపోవడం, పార్టీతో సంబంధం లేని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పట్టుకుని తిరగడం, అందుకు బీజేపీ పాలిత రాష్ట్రాలను ఎంపిక చేసుకోవడం పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన యాక్టివ్‌గా లేకపోవడాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed