KCR సైలెంట్.. పాలిటిక్స్‌పై వైరాగ్యమే కారణమా..?

by Rajesh |
KCR సైలెంట్.. పాలిటిక్స్‌పై వైరాగ్యమే కారణమా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతున్నది. సొంత పార్టీలో నమ్మకస్తులైన ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నా చూస్తున్నారే తప్పా, కనీనం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న లీడర్లను కనీసం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తే, పార్టీలో పరిస్థితులు మరోరకంగా ఉండేవని అభిప్రాయాలు నెలకొన్నాయి.

ఝలక్ ఇస్తున్న నమ్మకస్తులు

కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ప్రయారిటీ ఇచ్చిన లీడర్లే, ఇప్పుడు ఆయనకు ఝలక్ ఇస్తున్నారు. ఇంత కాలం పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఫస్ట్ టర్మ్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి, రెండో టర్మ్‌లో స్పీకర్‌గా పనిచేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన్ను కేసీఆర్ ప్రతిసారి లక్ష్మీపుత్రుడు అంటూ పొగిడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన కడియం శ్రీహరికి 2014లో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి, లోక్‌సభకు పంపారు.

రెండేళ్లలోపే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, డిప్యూటీ సీఎం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ను కాదని అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ప్రకటించిన తరువాత ఆయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి, కుమార్తెతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న ఎంపీ కే.కేశవరావుకు పార్టీలో తన తరువాత స్థానం సెక్రెటరీ జనరల్ పదవి ఇచ్చారు. మూడు సార్లు ఎంపీ పదవి ఇచ్చారు. ఆయన కుమార్తెను గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా చేశారు. అన్ని రకాల ప్రయోజనాలు పొందిన కేకే చివరికి పార్టీని వీడారు.

చేరికలను తప్పుపట్టలేని దుస్థితి

ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు (దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎల్పీని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనానికి కావాల్సిన 27 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు.

ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుపట్టడం లేదు. చూస్తూ మౌనంగా ఉండాల్సిన స్థితిలో తమ అధినేతే ఉన్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. 2014, 2018లో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. 2018లో ఏకంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఫిరాయింపులను ఎంక రేజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నది.

ఓటమిపై రివ్యూలు లేవు

బీఆర్ఎస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదుర్కొన్నది. కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ సీటు సైతం గెలవలేకపోయింది. ఆ రిజల్ట్ వచ్చినప్పట్నించి కేసీఆర్ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఎక్కువ సమయం తన ఫామ్ హౌజ్‌లోనే గడుపుతున్నారు. ఎవరైన లీడర్లు వెళ్తే మాత్రమే కలుస్తున్నారే తప్పా, ఇంతవరకు పార్టీ ఎమ్మెల్యేలను, లీడర్లను పిలిచి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం? ఎక్కడ లోపం ఉంది? అనే అంశాలపై రివ్యూ జరపలేదు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొనకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితులు వస్తాయనే ప్రచారం ఉంది.

వైరాగ్యంలో బాస్?

ఓ వైపు ఘోర ఓటమి, మరోవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు. ఈ రెండు అంశాలను చూస్తోన్న కేసీఆర్ మౌనంగా ఉండటం వెనుక రాజకీయ వైరాగ్యం నెలకొందేమోనని ప్రచారం జరుగుతున్నది. ఉద్యమకాలం నుంచి మొన్నటి వరకు ఆయన రాజకీయాలను శాసిస్తూ, పదేళ్ల పాటు సీఎంగా రాష్ట్రాన్ని పాలించారు. అధికారం కోల్పోవడంతో పాటు, ఒక్క ఎంపీ సీటు రాకపోవడంతో వైరాగ్యం నెలకొన్నదేమోనని టాక్ పార్టీలో జరుగుతున్నది. అందుకే ఆయన రెగ్యూలర్ పాలిటిక్స్‌ను పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు ఉన్నాయి.

Advertisement

Next Story