ఆ విషయంలో YS Jagan Mohan Reddy ను ఫాలో అవుతున్న KCR !

by Nagaya |   ( Updated:2022-11-16 09:54:02.0  )
ఆ విషయంలో YS Jagan Mohan Reddy ను ఫాలో అవుతున్న KCR !
X

దిశ,డైనమిక్ బ్యూరో: మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్ గా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్ష, పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ కీలక అంశాలపై పార్టీ నేతలతో చర్చించి మార్గదర్శకత్వం చేశారు. ఇకపై పార్టీ నేతలంతా రాజకీయ కోణంలోనే పని చేయాలని అసెంబ్లీ ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేశామని ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో మరింత కష్టపడి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న స్ట్రాటజీనే తెలంగాణలో కేసీఆర్ అనుసరించేలా పార్టీ నాయకులకు సరికొత్త టాస్క్ అప్పగించారు. ప్రస్తుతం ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు. చేపట్టిన పనులను వివరిస్తూ ప్రజాసమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం విషయంలో సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.

ప్రజల వద్దకు వెళ్లేందుకు అలసత్వం ప్రదర్శిస్తున్న వారిని రివ్యూ మీటింగ్ లో తలంటిపోస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే వ్యూహాన్ని కేసీఆర్ సైతం తెలంగాణలో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఆత్మీయ సమ్మేళనాల వ్యూహం కారు పార్టీకి కలిసి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో 90 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే టార్గెట్ పెట్టుకున్న కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలను ఆయుధంగా మార్చుకోవాలని నిన్నటి సమావేశంలో సూచించినట్టు తెలిసింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, అయితే వీటిని తూతూమంత్రంగా కాకుండా పక్కాగా ఆచరించాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళనం అంటే ఏదో వచ్చామా.. భోజనం చేశామా.. వెళ్లామా.. అన్నట్టుగా కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలని వీటికి మంత్రులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారట.

ప్రతి పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఉండేలా ప్లాన్ చేసుకుని ఇందులో రాజకీయ చర్చలు విస్తృతంగా జరిపించాలని, సమస్యలను తెలుసుకుంటా వాటిని పరిష్కరించేలా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారట. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత నియోజకవర్గాలకు వేరువేరుగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా నియోజకవర్గాల వారీగా ప్రోగ్రెస్ కార్డులు రూపొందించాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాక మునుపు వచ్చిన తర్వాత జరిగిన మార్పును స్పష్టంగా ప్రజలకు వివరించేలా ఈ ఆత్మీయ సమ్మేళనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా తాను కూడా ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు అవుతానని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారా లేక ఇతర జిల్లాలోని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారా అనేది ఆసక్తిగా మారింది.

Read more:

1.ఈటల కారెక్కనున్నారా..? ఆయన సైలెన్స్ దేనికి సంకేతం?

Advertisement

Next Story

Most Viewed