కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి.. నెలకు లక్షన్నర జీతం

by GSrikanth |
కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్ర వ్యక్తి.. నెలకు లక్షన్నర జీతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రైవేట్ సెక్రటరీగా మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌కు చెందిన శరద్ మర్కడ్ బాబాసాహెబ్ నియమితులయ్యారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ యాక్టివిటీస్‌ను కేసీఆర్ ముమ్మరం చేసిన సమయంలో షేట్కారీ సంఘటన్‌కు చెందిన పలువురు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేరారు. శరద్ మర్కడ్ కూడా ఏప్రిల్ 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో లాంఛనంగా చేరారు. పూణె యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ పూర్తిచేసిన శరద్‌కు ఒక ఐటీ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చినా దాన్ని తిరస్కరించి బీఆర్ఎస్‌లో చేరారు. గత నెల 1వ తేదీన చేరిన ఆయనకు నెల రోజుల్లోనే సీఎం కేసీఆర్‌కు ప్రైవేట్ సెక్రటరీ పోస్టింగ్ ఇస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈ నెల 2న ఉత్తర్వులు జారీచేశారు.

ప్రైవేట్ సెక్రటరీలను నియమించుకోవడం ముఖ్యమంత్రి విచక్షణాధికారం అయినప్పటికీ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని నియమించుకోవడం చర్చలకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు లక్షన్నర జీతం ఇచ్చే ప్రైవేటు సెక్రటరీ పోస్టుకు పార్టీకి చెందిన వ్యక్తిని నియమించుకోవడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఇచ్చే జీతాన్ని మహారాష్ట్రలో బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం అక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించుకోవడాన్ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజాధనాన్ని పార్టీ అవసరాల కోసం వినియోగించుకోవడాన్ని ఎత్తిచూపారు.

Advertisement

Next Story

Most Viewed