వీఆర్ఏలకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్

by Javid Pasha |   ( Updated:2023-05-18 14:06:52.0  )
వీఆర్ఏలకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని వీఆర్ఏలకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ కొత్త సెక్రటేరియట్ లో మొదటిసారి భేటీ అయిన తెలంగాణ కేబినేట్ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తమ డిమాండ్ నెరవేరడంతో వీఆర్ఏల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాగా సీఎం కేసీఆర్ 2017, ఫిబ్రవరి 24న ప్రగతి భవన్‌‌‌‌లో వీఆర్ఏలతో సమావేశమై వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని తొలిసారిగా హామీ ఇచ్చారు. తర్వాత 2020, సెప్టెంబర్‌‌‌‌లో వీఆర్​వో వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. పే స్కేల్ ఇస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.260 కోట్ల భారం పడుతుందని లెక్కలు వేశారు. వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏలు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్‌‌ఏ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఆందోళనలు నిర్వహించిన వీఆర్ఏలు చివరికి నిరుడు జూలై 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అక్టోబర్ 14 వరకు 80 రోజులపాటు సమ్మె కొనసాగింది.

సెప్టెంబర్13న అసెంబ్లీ ముట్టడికి భారీగా వీఆర్ఏలు తరలిరావడం, మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకు దిగడంతో స్వయంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్చించారు. అదే నెల 20న మరోసారి అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ సమక్షంలో చర్చలు జరిపారు. సమ్మె విరమించాలని కోరితే.. పే స్కేల్ జీవో ఇచ్చేదాక సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు. అక్టోబర్ నాటికి మునుగోడు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో వీఆర్ఏల సమ్మె ప్రభావం ఉండొద్దనే ఉద్దేశంతో అక్టోబర్14న మరోసారి మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ప్రగతి భవన్ లో వీఆర్ఏ జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని, తమపై నమ్మకం ఉంచాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మునుగోడు ఎన్నికలు అయిపోగానే డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో వీఆర్ఏలు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఇది జరిగి ఆరు నెలలవుతున్నా పే స్కేల్ జీవో విడుదల చేయడం లేదు. కాగా ఇవాళ జరిగిన కేబినేట్ భేటీలో వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed