- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: మహారాష్ట్రపై కన్నేసిన KCR.. BRS బలోపేతానికి గులాబీ బాస్ నయా వ్యూహం!
జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు రెడీ అయిన గులాబీ పార్టీ.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది. అందులో భాగంగా ముఖ్యంగా మహారాష్ట్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలు ఎక్కువగా ఉండటం తమకు కలిసి వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారు. దానికి తోడు శివసేన అంటే హిందుత్వ పార్టీ అనే భావన అక్కడి ప్రజల్లో ఉన్నది. ఇక దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఇక్కడ బలపడే అవకాశాలు లేవనేది బీఆర్ఎస్ అభిప్రాయం. మరో వైపు ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో సంక్షోభం మరింత పెరగనుంది. ఈ పరిస్థితులన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతున్నాయని, యాంటీ బీజేపీ పార్టీగా తమ పార్టీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని గులాబీ బాస్ భావిస్తున్నారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు రాస్తా క్లియర్ అవుతుందని నమ్ముతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్న తర్వాత మహారాష్ట్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందుకు నిర్దిష్టమైన కారణాలే ఉన్నాయి. యాంటీ బీజేపీ ఫోర్స్‌గా చెప్పుకుంటూ జాతీయ పార్టీగా ఎదగాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్న టైమ్‌లోనే మహారాష్ట్రను కార్యక్షేత్రంగా కేసీఆర్ ఎంచుకోవాలని భావించారు. ఈ ఏడాదిన్నర సమయంలో ఆయన అంచనాలకు తగ్గట్టుగానే అక్కడి రాజకీయ పరిస్థితులు గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ శూన్యత, అక్కడి పార్టీలకు ఉన్న బలహీనతలు, నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్‌కు ఉన్న అనుకూల పరిస్థితులు కేసీఆర్‌కు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వారి నుంచి వినిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో వాటిని అందుపుచ్చుకోడానికి ఇతర పార్టీల కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆ రాష్ట్రంపై దృష్టి సారించిన కేసీఆర్.. మహారాష్ట్రలో ఇప్పటికే మూడు చోట్ల బహిరంగసభలు పెట్టారు. ఆ రాష్ట్ర నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న డెవలప్‌మెంట్, వెల్ఫేర్ అంశాలతో ఆ రాష్ట్ర పరిస్థితులను పోల్చి వారికి అవగాహన కలిగిస్తున్నారు. ప్రత్యేకంగా రైతు సంఘాల నాయకులను తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును చూపిస్తున్నారు.
మహారాష్ట్ర పార్టీల్లో సంక్షోభం
మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలకు వాటివాటి బలహీనతలు ఉన్నాయన్నది కేసీఆర్ భావన. దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పార్టీని పటిష్టంగా ఉంచుకోవడమే దానికి సవాలుగా మారింది. చాలా ఏండ్ల పాటు పవర్‌లో ఉన్నా హిందుత్వ పార్టీగానే దానికి ప్రజల్లో గుర్తింపు ఉన్నది. రాష్ట్రంలో మరాఠ్వాడా ప్రాంతంలో మాత్రం ఆ పార్టీకి బలమున్నదని, మిగిలిన జిల్లాల్లో దాని ఉనికి నామమాత్రమేననేది బీఆర్ఎస్ అభిప్రాయం. భావజాలంలో బీజేపీతో సారూప్యత ఉన్న శివసేన.. బాల్‌థాకరే సమయం నుంచి చాలాకాలంపాటు బీజేపీతో స్నేహంగా ఉన్నది.
ఇటీవల మాత్రమే కాంగ్రెస్‌కు సన్నిహితమైంది. భవిష్యత్తులో తిరిగి బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలున్నాయనేది బీఆర్ఎస్ అంచనా. ఎన్సీపీ, కాంగ్రెస్‌కు సెక్యులర్ పార్టీలనే గుర్తింపు ఉన్నది. కానీ ఆ రెండూ సొంత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్ రాజీనామా చేశారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. శరద్ పవార్ సమీప బంధువైన అజిత్ పవార్ గతంలో మంత్రిగా పనిచేశారు. వీరిద్దరూ పవార్‌కు నమ్మకస్తులు. ఇప్పుడు అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా చేయడంతో పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. పార్టీ పగ్గాలు ఎవరి చేతికెళ్తాయన్నది చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర ప్రజల్లో పవార్‌కు ప్రత్యేక గుర్తింపు, అభిమానం ఉన్నా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు ఏంటనే చర్చ మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దానికి బలమైన పట్టు ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా, పలుమార్లు మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకున్నా దేశవ్యాప్తంగా బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలోనూ అలాంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. ఆ పార్టీ ప్రస్తుత బలాన్ని పరిగణనలోకి తీసుకుంటే సమీప భవిష్యత్తులో అది తిరిగి అధికారం చేపడుతుందని చెప్పలేం. ఏక కాలంలో అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను సొంత సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ అనిశ్చిత రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మల్చుకునే దిశగా ప్రయత్నించే అవకాశమూ వాటికి లేకుండాపోయింది.
ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్‌గా బీఆర్ఎస్!
మహారాష్ట్రలోని మూడు ప్రధాన పార్టీలు అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్నాయి. శివసేనకు హిందుత్వ ముద్ర ఉన్నందున జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకుని శక్తిగా అవతరించే అవకాశం ఆ పార్టీ ఇప్పట్లో లేదన్నది కేసీఆర్ భావన. కాంగ్రెస్, ఎన్సీపీలకు సెక్యులర్ అనే ముద్ర ఉన్నప్పటికీ బీజేపీతో గట్టిగా కొట్లాడే శక్తి లేదని బీఆర్ఎస్ అభిప్రాయం. ఆ రెండు పార్టీలు అంతర్గత సంక్షోభం నుంచి బయటపడి ఐక్యంగా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు లేవని గులాబీ పార్టీ భావిస్తున్నది. ఇలాంటి రాజకీయ శూన్యతలో పరిస్థితులను అందిపుచ్చుకునే పొలిటికల్ ఫోర్స్ ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు.
బీజేపీతో గట్టిగా కొట్లాడే శక్తి తమ పార్టీకే ఉన్నదనే బలమైన మెసేజ్‌ను మహారాష్ట్రలో నిర్వహించిన మూడు బహిరంగసభల ద్వారా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లినట్టు కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగులో సైతం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మహారాష్ట్రలోని అనుకూల పరిస్థితులను కేసీఆర్ వివరించారు. తెలంగాణలోని పథకాలను, ప్రయోజనాలను, ఫలాలను, ప్రగతిని అక్కడి నుంచి వస్తున్న నేతలకు అర్థం చేయించడంతో పాటు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ఇతర జిల్లాల నేతలు బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి కనబర్చడానికి ఇదే కారణమని గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నేడు కౌన్సిల్ సమావేశం.. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యూహంలోకల్ టు పార్లమెంటు పోటీ స్ట్రాటెజీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ద్వారా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్లమెంటుకు రాస్తా క్లియర్ అవుతుందని బీఆర్ఎస్ నమ్ముతున్నది. తెలంగాణతో సరిహద్దు ఉన్న నాందేడ్, యావత్‌మల్, గడ్‌చిరోలి తదితర జిల్లాలపై గులాబీ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం, వెనకబాటుతనం ఉన్నది. అందుకే తెలంగాణలో అమలవుతున్న పథకాలు అక్కడి రాజకీయ నేతలకు బీఆర్ఎస్‌పై ఆసక్తి పెరిగింది. ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడానికి బహిరంగసభలను బీఆర్ఎస్ వాడుకుంటున్నది. ఈ జిల్లాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలకు పట్టు ఉన్నా దీర్ఘకాలంగా ఆ పార్టీల పాలనను చూసిన ప్రజలు బీఆర్ఎస్‌ను ఒక కొత్త రాజకీయ శక్తిగా ఆదరిస్తారన్న నమ్మకం ఏర్పడింది. అందుకే స్థానికంగా ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుంటున్నది.
ఎన్సీపీ నేతలు చేరుతున్నా ఆ పార్టీ సైలెంట్
ఎన్సీపీకి చెందిన నేతలు బీఆర్ఎస్‌లో చేరుతున్నవారిలో ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడి మొదలు జిల్లా స్థాయి నాయకుల వరకు ఎంత మంది చేరుతున్నా ఎన్సీపీ నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఆ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, కోర్ కమిటీ సభ్యుడు, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా ఏప్రిల్ 2న బీఆర్ఎస్‌లో చేరారు. ఆ రాష్ట్ర మాజీ మంత్రి బాబూరావు మడావి కుమారుడు దినేశ్ కూడా గత నెల 22న గులాబీ కండువా కప్పుకున్నారు. ఔరంగాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు నణ్వా సింగ్, ఆ పార్టీ సీనియర్ నేత త్రయంబత్ ముడ్గే, మరో సీనియర్ నేత ప్రదీప్ సాలుంకే, వైజాపూర్ మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్, ఎన్సీపీ కార్పొరేటర్ చంద్రకాంత్ బచ్చన్, గంగాపూర్ నియోజకవర్గ ఎన్సీపీ ఇన్‌చార్జి సంతోష్ కుమార్.. ఇలా చాలా మంది ఎన్సీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు.
ఎన్సీపీలో సంక్షోభం కారణంగానే..
పార్టీ సీనియర్ నేతల మొదలు లోకల్ స్థాయి వరకు ఎన్సీపీ వీడటానికి కారణం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభమేననేది బీఆర్ఎస్ భావన. ఆ పార్టీ బలహీనపడుతున్నందున కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలను ఆ నేతలు ప్రత్యామ్నాయంగా భావించడంలేదని, అందువల్లనే బీఆర్ఎస్ ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్‌గా మారిందనేది గులాబీ నేతల అభిప్రాయం. శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నందున ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని, బీఆర్ఎస్‌కు మరింత అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉన్న బలహీనతల దృష్ట్యా మహారాష్ట్రలో ఇకపైన బీజేపీని శక్తివంతంగా ఎదుర్కొనగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అని గులాబీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ రాజకీయ శూన్యతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
Also Read: బుజ్జగింపులు ‘‘ఫెయిల్’’.. మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన బాలినేని..!?
Also read: నేడు కౌన్సిల్ సమావేశం.. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యూహం..