సచివాలయం ప్రారంభోత్సవ వేళ ప్రతిపక్షాలపై KCR ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-30 10:12:29.0  )
సచివాలయం ప్రారంభోత్సవ వేళ ప్రతిపక్షాలపై KCR ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం ప్రజా ప్రతినిధులను, అధికారులను ఉద్దేశించి ఆ ప్రాంగంణంలోనే మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... విమర్శలు చేస్తున్నవారిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర పునర్ నిర్మాణమంటే ఏంటో తెలియని మరుగుజ్జులని, అర్బకులనీ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం అహింసాయుత పద్ధతుల్లో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇకపైన ఆయన బాటలోనే భవిష్యత్ ప్రయాణం కూడా ఉంటుందన్నారు. అందుకే మార్గదర్శిగా ఆయన పేరును సచివాలయానికి పెట్టుకున్నామన్నారు. ఆ పునర్ నిర్మాణ ప్రక్రియకు నిలువెత్తు నిదర్శనమే కొత్తగా కట్టుకున్న సచివాలయ భవనమని అన్నారు. ఉద్యోగులందరి సమిష్టి సహకారంతో ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే పాలన దిశగా ఈ సచివాలయం ఉంటుందన్నారు.

తొమ్మిదేళ్ళ కాలంలో ఎన్నో రంగాల్లో సాధించిన అభివృద్ధే రాష్ట్ర పునర్ నిర్మాణమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం అంకితభావంతో పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ భావాన్ని, ఆకాంక్షను అర్థం చేసుకోలేని అర్బకులు, మరుగుజ్జులు కొందరు అవాకులు చెవాకులు పేల్చారని, అన్నింటినీ కూల్చి కొత్తవి కడతారా అంటూ కురచ బుద్ధితో కొన్ని కామెంట్లు చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ వాటిని తాము పట్టించుకొలేదని, ఆకాశమంత ఎత్తులోకట్టుకున్నామన్నారు. పునర్ నిర్మణమంటే ఆనాటి సమైక్య పాలనలో చిక్కిశల్యమైపోయిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి నిర్మించుకోవడమేనని అన్నారు. నాటి కాకతీయుల స్ఫూర్తితో నీళ్ళు సాధించుకున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు యావత్తు ప్రపంచ గుర్తింపునే పొందిందని, మండు వేసవిలోనూ కాల్వల్లో నీళ్ళు పారుతున్నాయని.. ఇవన్నీ పునర్ నిర్మాణానికి ప్రతీకలన్నారు.

పరిపాలనకు గుండెకాయగా, పాలనాకేంద్రంగా నిర్మించుకుని ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జీవితంలోని పెద్ద అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఎంతోమంది ప్రాణాలను అర్పించారని, వారికి జోహార్లు చెప్పుకోవడంతో పాటు అంబేద్కర్ బాటలో రాష్ట్ర ప్రయాణం జరగడం తెలంగాణ సాధించిన ప్రగతి అని తెలిపారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, 24 గంటల నాణ్యమైన సరఫరా, మిషన్ భగీరధ ద్వారా ప్రతి ఇంటికీ త్రాగునీరు, దేశంలోనే రికార్డు స్థాయిలో పంటలు పండడం, రైతుల జీవన ప్రమాణాలు పెరగడం, పేదలకు అందుతున్న ఆసరా స్కీమ్‌తో చిరునవ్వులు కనిపించడం... ఇవన్నీ పునర్ నిర్మాణానికి ప్రతీకలన్నారు. అన్ని పల్లెల్లో, పట్టణాల్లో పచ్చదనం, వైకుంఠధామాలు, డంప్ యార్డులు, చివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అవార్డులు.. ఇవన్నీ ప్రగతికి కొలమానాలని అన్నారు.

యాసంగిలో సైతం మొత్తం దేశంలో పండుతున్న పంటల్లో సగం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని, రాష్ట్ర తలసరి ఆదాయం, పారిశ్రామికంగా వస్తున్న పెట్టుబడులు ఇందుకు నిదర్శనమన్నారు. ఒకప్పుడు పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచే కూలీ కార్మికులు ఇక్కడకు వస్తున్నారని, ఇది తెలంగాణ తొమ్మిదేళ్ళలో సాధించిన ప్రగతి అని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నామని, పాతవాటిని కూలగొట్టి ఆ స్థానంలో కొత్త కలెక్టర్ భవనాలు, ఎస్పీ కార్యాలయాలను కట్టుకోవడం.. ఇవన్నీ పునర్ నిర్మాణంలో భాగమన్నారు. మొత్తం ఇరవై నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో విమర్శలు చేసినవారికి సమాధానం ఇచ్చే తీరులో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed