ప్రతిపక్ష హోదా పోకుండా KCR పకడ్బందీ స్కెచ్!

by Sathputhe Rajesh |
ప్రతిపక్ష హోదా పోకుండా KCR పకడ్బందీ స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ‘హస్తం’ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ‘కారు’ దిగారు. దీంతో గులాబీ బాస్ రంగంలోకి దిగారు. నష్టనివారణ చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష హోదా పోకుండా పకడ్బందీ వ్యూహం రచిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో భేటీలు నిర్వహిస్తున్నారు.

33కు చేరిన సంఖ్య

గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘కారు’ గుర్తుపై 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ లో నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు తగ్గిపోయింది. మరికొంత మంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అస్ర్తాలను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో వరుస భేటీలకు ప్లాన్ వేసినట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా పోకుండా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో..

ఎర్రవెల్లి ఫాం హౌజ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రతి రోజు భేటీ అయ్యేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వారిలో భరోసా నింపడంతోపాటు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను వివరించి వారిని మానసికంగా సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో మంగళవారం నుంచి సమావేశాలు స్టార్ట్ చేశారు.

భేటీలు సత్ఫలితాలనిస్తాయా?

పార్టీ మారుతారనే ప్రచారం జరగడంతో భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్, బాన్సువాడ, జగిత్యాల ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ ను కలిశారు. పార్టీ మారబోమని ప్రకటించారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నది. అయితే కేసీఆర్ నిర్వహించే భేటీల్లో పాల్గొని వారు ఎలాంటి హామీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ భేటీలు ఏమేరకు ఫలితాలిస్తాయనే దానిపై పార్టీలో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed