కవిత 3D ప్లాన్..! ఇక ఆ పోరాటానికి కార్యాచరణ ఫిక్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-31 04:59:40.0  )
కవిత 3D ప్లాన్..! ఇక ఆ పోరాటానికి కార్యాచరణ ఫిక్స్
X

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కు కోసం భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడంచెల వ్యూహానికి రూపకల్పన చేశారు. లోక్‌సభకు డిసెంబర్-జనవరి నెలల్లో జరిగే శీతాకాల సమావేశాలు చివరివి కావడంతో అప్పటికల్లా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుడుతున్నారు. జాతీయ స్థాయిలో మిస్డ్ కాల్ క్యాంపెయిన్, యూనివర్శిటీలో విద్యావేత్తలు, ప్రొఫెసర్లతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు, ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచేలా కోట్ల సంఖ్యలో పోస్టు కార్డులు రాయించడం వంటి ప్రోగ్రామ్స్‌లను కవిత ఎంచుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ బిల్లును సాధించుకునేలా భారత్ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. మహిళలను మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యూనివర్శిటీలు, కళాశాలలు, మహిళా సంఘాలు.. ఇలా అందరూ భాగస్వామ్యం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే పలువురితో సంప్రదింపుల ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ ప్రయత్నంలో తొలి మెట్టుగా మార్చి 10న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ మినహా బీజేపీయేతర పార్టీల మద్దతు లభించిందన్న సంతృప్తిని వ్యక్తం చేసిన కవిత త్వరలో కాంగ్రెస్‌ భాగస్వామ్యాన్నీ పొందేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

వినూత్నంగా ‘మిస్డ్ కాల్’

మహిళా రిజర్వేషన్‌కు మద్దతు పలికే పార్టీలు, సంస్థలు మాత్రమే కాకుండా వ్యక్తులు భాగస్వామ్యం అయ్యేలా మిస్డ్ కాల్ క్యాంపెయిన్‌ను కవిత త్వరలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం టెలికామ్ సంస్థలతో కసరత్తు మొదలైంది. దేశ వ్యాప్తంగా ఒకే నంబర్‌ను వినియోగించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళా రిజర్వేషన్‌కు మద్దతు పలకాలనుకున్నా, యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవాలనుకున్నా ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే రింగ్ అయిన తర్వాత ఆటోమెటిక్‌గా కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత వారికి ఓ ఫోన్ కాల్ (ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డ్) వస్తుంది.

వారు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం అది డేటా బ్యాంకులో నిక్షిప్తమవుతుంది. క్యాంపెయిన్‌లో భాగస్వాములైనందుకు ధన్యవాదాల తరహాలో కవిత వాయిస్‌తో కూడిన రికార్డు మెసేజ్ వారికి వెళ్తుంది. వారి ఆప్షన్ మేరకు భవిష్యత్తులో మొబైల్ ఎస్ఎంఎస్‌లు, మెయిల్స్ తదితరాలు వారికి చేరుతూ ఉంటాయి. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌తో జరిగే యాక్టివిటీస్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ వారికి చేరుతూ ఉంటుంది.

ఫోన్ చేసిన వ్యక్తులపై చార్జీల భారం పడకుండా ఆటోమెటిక్‌గా కట్ అయ్యే వ్యవస్థను త్వరలోనే కవిత లాంఛనంగా (బహుశా హనుమాన్ జయంతి రోజున) హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. టెలికామ్ సంస్థ నుంచి బ్యాక్ ఎండ్ టెక్నికల్ సపోర్టు లాంటి చర్చలు పూర్తయిన తర్వాత నిర్దిష్టంగా ఓ నంబర్‌ను ఎమ్మెల్సీ స్వయంగా ప్రకటించనున్నారు.

యూనివర్శిటీల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు

దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మహిళలు, స్కాలర్లు, విద్యార్థులు తదితరులతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించేలా కవిత ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు. మహిళా రిజర్వేషన్ ఆవశ్యకత - దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం - మహిళా సాధికారత తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌ల్లో చర్చ నిర్వహించనున్నారు.

పార్లమెంటు ద్వారానే జరగాల్సిన ఈ ప్రక్రియకు కేంద్రంలో అధికార పార్టీ చొరవ తీసుకోవాలనే డిమాండ్‌తో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపైనా చర్చలు నిర్వహిస్తారు. అనంతరం తీర్మానాలు, దానికి తగిన కార్యాచరణ జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలూ కవర్ అయ్యేలా తొమ్మిది నెలల పాటు వీటిని విస్తృతంగా నిర్వహించేలా కవిత ప్లాన్ చేస్తున్నారు.

పోస్టు కార్డు ఉద్యమం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు కవిత పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. త్వరలోనే దీన్ని హైదరాబాద్‌ నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్ని పట్టణాలు, నగరాల నుంచి ప్రధానికి పోస్టు కార్డులు వెళ్లేలా నిర్దిష్ట టైమ్ పీరియడ్‌ను స్వయంగా ప్రకటించనున్నారు.

ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్

మూడంచెల క్యాంపెయిన్ తర్వాత ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్‌‌నూ మొదలు పెట్టాలని కవిత భావిస్తున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రక ప్రాధాన్యత పొందిన ప్రాంతాల్లో ర్యాలీలు, మార్చ్‌ఫాస్ట్‌లు, దీక్షలు తదితరాలను నిర్వహించాలన్నది ఆమె ఆలోచన. దీక్షలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జంతర్‌ మంతర్‌లో ఇప్పటికే ఆమె దీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలోనే ఇలాంటి నిర్దిష్టమైన గుర్తింపు పొందిన హిస్టారికల్ ప్రాంతాలను ఆన్‌గ్రౌండ్ యాక్టివిటీస్ కోసం ఎంచుకోనున్నారు. వీటిని నిర్వహించేటప్పుడు స్థానిక రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు తదితరాల మద్దతును కోరనున్నారు.

కేంద్రంపై ఒత్తిడి పెంచేలా..

వచ్చే ఏడాది మే నెలలో పార్లమెంటు గడువు ముగుస్తున్నందున ఫిబ్రవరిలో జరిగే సమావేశాలు కేవలం ఓటాన్ అకౌంట్‌గా మాత్రమే ఉంటున్నందున పూర్తి స్థాయి సమావేశాలు డిసెంబర్-జనవరి మధ్య జరిగే శీతాకాల సమావేశాలు మాత్రమేనని భావించిన కవిత అప్పటికల్లా బిల్లు పార్లమెంటుకు చేరేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే 15 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టామన్న సంతృప్తితో పాటు పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యుల నుంచి స్వల్పకాలిక చర్చ కోసం నోటీసులు ఇవ్వడం మొదలు కావడం ఆహ్వానించదగిన పరిణామమని భావిస్తున్నారు. రానున్న కాలంలో చేపట్టే పలు క్యాంపెయిన్‌లతో మరింత ఒత్తిడి పెంచొచ్చన్న ధీమానూ ఆమె వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed