Whip Adi Srinivas : రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

by Sridhar Babu |
Whip Adi Srinivas : రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
X

దిశ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గంతో పాటు రాజన్న ఆలయ అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆది మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటని, 10 ఏండ్లు అధికారంలో ఉండి రాజన్న ఆలయానికి అణా పైసా కేటాయించని అసమర్థ పార్టీ బీఆర్ఎస్ అని, 10 ఏండ్లు కేంద్రంలో అధికారంలో ఉండి రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో చేర్చని పార్టీ బీజేపీ అని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజన్న ఆలయానికి రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఎమ్మెల్యే పదవిని కేవలం హోదాకు చిహ్నంగా వాడుకొని వేములవాడ ప్రజలను మోసం చేసిన నాయకుడు, పరాయి దేశ పాలకుడు నేడు చిలకపలుకులు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు.

రూ.155 కోట్ల నిధులు ఏవి అంటున్న నాయకుడు మరి ఆనాడు వారి ప్రభుత్వ హయాంలో నిధులు ఎందుకు తేలేదని, కేవలం ఎన్నికల్లో లబ్ది కొరకే రూ. 155కోట్ల అభివృద్ధి నిధులు తెస్తున్నట్లు ప్రజలను నమ్మించి, మసిబూసి మారేడు కాయ చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలను మోసం చేసే క్రమంలో లేని, రాని నిధులను వచ్చినట్లు చూపించారని, మళ్లీ ఇప్పుడు ఏవి అని అడుగుతున్నారంటే ఆనాడు వారు చూపించింది చిత్తు కాగితాలు అన్నట్లే కదా అని అన్నారు. టికెట్ ఇవ్వలేరు అంటేనే తిరస్కరించినట్లు కాదా మళ్లీ ఉనికి కోసం తప్పుడు ఆరోపణలు చేయడం ఎందుకని రమేష్ బాబు నిలదీశారు. ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు కాకుండానే అభివృద్ధి ఏది, 6 గ్యారెంటీలు ఏవని అంటున్నారు. ఇంతకీ 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను అగౌరవపరిచినట్లు చిత్రీకరిస్తున్నారని, అసలు మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నది నిజం కదా అని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు సిద్దమవుతున్నది వాస్తవం కాదా అని, ఎల్లంపల్లి పేజ్-1, పేజ్-2 తో నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు రూ.320 కోట్లు, కెనాల్ నెట్ వర్క్ కొరకు బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులు, చేనేత కార్మికులను అదుకునేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, రుణమాఫీ

వంటి సహోసోపేత నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా అని, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాదిగల ఆత్మగౌరవం కాపాడేలా దేశంలోనే పేరుగాంచిన అడ్వకేట్లను పెట్టి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం తెలంగాణ కదా...? అంటూ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది నిజం కాదా అని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల సహకారంతో నియోజకవర్గాన్ని, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా తమపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండిస్తున్నట్టు, తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి మీరు చేసిన తప్పులను

తెలుసుకోండని అన్నారు. పరాయి దేశంలో ఉండి చిలుక పలుకులు పలికిన నాయకుడా అసత్యపు ఆరోపణలను వెనక్కి తీసుకుని ఫ్లయిట్ లో వచ్చి ముక్కు నేలకు రాసి వెళ్లు అంటూ రమేష్ బాబుకు సవాలు విసిరారు. దిష్టిబొమ్మలను దహనం చేసిన వ్యక్తులు, వారు చేసిన తప్పును తెలుసుకొని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజల సంక్షేమానికి తాను చిత్తశుద్ధితో ఉన్నానని, తాను కిందిస్థాయి నుండి వచ్చిన వ్యక్తినని, నాకు ప్రజల

కష్టాలు తెలుసని, కొంతమంది వ్యక్తులు తనపై అనవసరంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని, అందరూ మనవాళ్లని అనుకుని గౌరవంగా ఉంటే వక్రబుద్ధి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరేమి అనుకున్నా నియోజకవర్గ ప్రజల ముందుకు సేవకుడిగా వచ్చానని, సేవ చేస్తున్నానని, నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇంకా సేవ చేస్తూనే ఉంటానని, ఎవరేంటి అనేది నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనించాలని, ప్రతిపక్ష పార్టీల నాయకుల మోసపూరిత మాటలను, వారి కపట ప్రేమను నమ్మి మోసపోకండని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed