అన్నా మెల్లగ పో.. రోడ్డుపై వెరైటీగా హెచ్చరిక బోర్డు

by Sathputhe Rajesh |
అన్నా మెల్లగ పో..  రోడ్డుపై వెరైటీగా హెచ్చరిక బోర్డు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రమాదకరమైన మూల మలుపు ఉంది జాగ్రత్తగా వెళ్లండి. యాక్సిడెంట్ ఏరియా గో స్లో... ఇలాంటి హెచ్చరికల బోర్డులను సాధారణంగా రహదారులపై చూస్తుంటాం. రోడ్డు బావుందని చాలా వేగంగా వెళ్తున్న క్రమంలో మూల మలుపులు రావడం.. దగ్గరకు వెళ్లగానే వాహనాలను కంట్రోల్ చేసుకోకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతుండడం కామన్. తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఇంజనీరింగ్ విభాగం అధికారులో లేక, పోలీసులో ప్రమాదాల నివారణకు కోసం చర్యలు తీసుకుంటుంటారు. కానీ అక్కడ మాత్రం కాస్తా డిఫరెంట్ నినాదం కనిపిస్తుంటుంది. అత్యంత ప్రమాదకరమైన టర్నింగ్ వద్ద సామాన్యులకూ అర్థం అయ్యే రీతిలో ఓ బోర్డు ఏర్పాటు చేశారు స్థానికులు. చదవడానికి కామన్ గానే ఉన్నా ఎక్కడ కూడా ఇలా రాసి వాహనదారులను అప్రమత్తం చేసి ఉండరు.

.జగిత్యాల జిల్లా ఏకిన్ పూర్ శివార్లలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ, జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రధాన రహదారిలో ఉన్న ఈ టర్నింగ్ తిరుగుతుండగానే ఓ వంతెన కూడా వస్తుంది. దీంతో వాహనాల్లో వచ్చి వెళ్లేవారు జాగ్రత్తగా నడపాలని సూచించేందుకు స్థానికులు వెరైటీగా ఓ నినాదాన్ని రాసిపెట్టారు. వంతెన సమీపంలోని ఓ పోల్ కు '' అన్నా మెల్లగా పో'' అంటూ రాసి ఉన్న ఓ బోర్డును ఏర్పాటు చేశారు. తెలంగాణలో అన్న అని పిలవడం సాధరణం కాగా.. మెల్లగా పో అన్న పదాన్ని కూడా చాలా మంది పలుకుతుంటారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసిన ఈ బోర్డు కొత్తగా వచ్చే వారిని ఆకట్టుకుంటోంది. సాధారణంగా మాట్లాడుకునే పదాలతో ఈ బోర్డును ఏర్పాటు చేయడం మాత్రం వెరైటీగా ఉందని అనుకుంటూ ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనదారులు కామెంట్ చేస్తూ వెళ్తుంటారు.

Advertisement

Next Story