సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

హక్కుల పరిరక్షణకు మలిదశ ఉద్యమం రావాలి

అంగట్లో అమ్మకానికి విద్య, మద్యం ముందు వరుసలో

దిశ, జగిత్యాల ప్రతినిధి : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిందని హక్కుల పరిరక్షణకు మలిదశ ఉద్యమం రావాలని మలిదశ ఉద్యమం జగిత్యాల నుంచే మొదలవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఇందిరా భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల తో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం వేడుకల్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఏ ఆకాంక్షల కోసమైతే ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో నేటికీ అవి నెరవేరలేదన్నారు. ఉద్యోగాలు లేక యువత నిరాశలో ఉన్నారని ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. నిధుల విషయానికి వస్తే.. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని రాష్ట్రాన్ని సీఎం బండల, బొందల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. టీచర్ల నియామకం చేపట్టకుండా విద్య బోధన ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో మెరుగైన బోధన కోసం విద్య వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేశారని విద్యను అంగట్లో అమ్మకానికి పెట్టారని మద్యం అమ్మకాల్లో మాత్రం ముందు వరసలో ఉందని మండిపడ్డారు. నేటికీ ప్రతి ఉద్యగం కూడా ఆంధ్రోళ్లే కొట్టుకు పోతున్నారని స్థానిక రిజర్వేషన్లు ఏర్పాటు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమే నీరుగారి పోతుందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జలాశయాలు నింపడం తప్ప ఒక్క ఎకరాకు సాగు నీకివ్వడం లేదని చివరకు రైతులకు కూడా అన్యాయమే చేశారని అన్నారు.

తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలకు చలించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ, రాష్ట్ర ఏర్పాటు తో ప్రజలు తమ హక్కులను మాత్రమే పొందగలిగారు కానీ హక్కుల పరిరక్షణ కోసం మలి దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జగిత్యాల నుండే మలి దశ ఉద్యమం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కావాలనే ప్రజల చిరకాల ఆకాంక్షను నేరివర్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులు కల్లేపల్లి దుర్గయ్య, గాజేంగి నందయ్య, రమేష్ రావు, రేపల్లె హరి కృష్ణ, బింగి రవి, నర్సయ్య, కమటాల శ్రీనివాస్, ధర రమేష్ బాబు, గుండా మధు, నెహల్, చిట్ల అంజన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story