- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేవాదుల ఇప్పుడు గుర్తొచ్చిందా

దిశ లింగాల గణపురం/ స్టేషన్ ఘన్ పూర్/జఫర్ గడ్ : 15 ఏళ్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు గుర్తురాని దేవాదుల ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్ ఘన్ పూర్, జఫర్ గడ్ మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 5 వేల కోట్లతో పూర్తయ్యే దేవాదుల ప్రాజెక్టుకు 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు అన్నారు. దేవాదుల కాల్వలు పూడిక, చెట్లతో నిండిపోయినా పట్టించుకోని గత పాలకులు ఏ ముఖం పెట్టుకొని దేవాదుల పంప్ హౌస్ కు వెళ్తున్నారని ప్రశ్నించారు. దేవాదుల మూడో టర్నల్ పొడవు ఎంత, నీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని వారు దేవాదుల పంప్ హౌస్ వద్ద ధర్నా చేయడం సిగ్గుచేటు అన్నారు.
గత ఎమ్మెల్యే ఏనాడు కూడా కాల్వల వెంట తిరగలేదని, తట్ట మట్టి కూడా తీయని వాడు ఈరోజు కాల్వల గురించి మాట్లాడుతున్నాడని, ఇందుకు కొంచమైనా ఉండాలన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం కృంగిపోయిందని, ఇంకా ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించాలని చూస్తే బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. నియోజకవర్గంలోని రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడాదిలోగా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆపన్న హస్తం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ లు వెంకటేశ్వర్లు, శంకరయ్య, ఎంపీడీఓలు జయశ్రీ, సుమన్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, మండల అధ్యక్షులు శిరీష్ రెడ్డి, ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు బెల్ద వెంకన్న, పోగుల సారంగపాణి, సింగపురం వెంకటయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, నీలగట్టయ్య, కర్ణాకర్ రావు, రాజేష్ నాయక్, బాబు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.