మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి.. రేవంత్ రెడ్డి

by Sumithra |
మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి.. రేవంత్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి, వెల్గటూర్ : రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా మా జీవితాల్లో మార్పు కావాలి తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలనే చెబుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికార దుర్వినియోగం తెలంగాణలో జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చే పదేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ధర్మపురిలో పక్కనే గోదావరి ఉన్న ఇక్కడి ప్రజల రైతుల తాగు సాగునీటి కష్టాలు తీరలేదని అన్నారు. ధర్మపురి ప్రజలు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ను గెలిపిస్తే ఇక్కడ పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కట్టడాలను మార్చి అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్ మినిస్టర్లుగా చేసిన హరీష్ రావు, కేసీఆర్ కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుటుంబమే ప్రతి పైసాకు బాధ్యత వహించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని విరుచుకుపడ్డారు. ఇసుక పక్కకు జరగడం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చెప్పడం సిగ్గుచేటు అని రెండు గదుల ఇల్లు కడితేనే బలమైన పునాది వేస్తామని, అలాంటిది ఇసుక పై అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నించారు. ధర్మపురి ప్రజలు అభిమానంతో లక్ష్మణ్ కుమార్ ను గెలిపిస్తే కేసీఆర్ అండతో ఈశ్వర్ అన్యాయంగా ఈవీఎంలను మార్చి కుట్ర పూరితంగా ఎమ్మెల్యేగా మినిస్టర్ అయ్యాడని అయినా ఈ ప్రాంత పేదలకు ఈశ్వర్ చేసిందేమి లేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి..

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు మంత్రులుగా ఉన్న వైఎస్సార్, జీవన్ రెడ్డి శ్రీధర్ బాబులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 38 వేల 5 వందల కోట్లతో 14 లక్షల ఎకరాల భూమికి నీరు ఇవ్వాలని ప్రాజెక్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ధర్మపురిలో దివంగత మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప కొప్పుల ఈశ్వర్ చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదని ఆయన ఫామ్ హౌస్ లో పండిస్తున్నవడ్లు 4250 రూపాయల చొప్పున కావేరి సీడ్స్ కొంటె కల్లాల్లో ఉన్న రైతుల వడ్లు ఎక్కడికక్కడే ఉన్నాయని అన్నారు. రైతులు పండించిన వడ్లకు రెండు వేల ధర కూడా రావడం లేదని కేసీఆర్ పండించిన వడ్లలో బంగారం ఉంటే రైతులు పండించిన దాంట్లో మట్టి ఉందా అని దుయ్యబట్టారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వివేక్, ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed