Social Media Influence: యువత పెడదారి.. వ్యసనాలకు బానిసలవుతోన్న వైనం

by Shiva |
Social Media Influence: యువత పెడదారి.. వ్యసనాలకు బానిసలవుతోన్న వైనం
X

దిశ, రాజన్నసిరిసిల్ల ప్రతినిధి: నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉంటుందని అంటారు. కానీ ప్రస్తుత కాలంలో బాల్యం నుంచి చెడు వ్యసనాలకు బానిసలై యువత తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది యువత ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని కష్టపడుతుంటే, చాలామంది యువత మాత్రం ఎటువంటి లక్ష్యం లేకుండా సెల్ ఫోన్లు, మద్యం, గాంజా, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను బానిసలుగా మారుతున్నారు. మరికొందరు సరదాల కోసం మందు తాగుతూ, సిగరెట్టు కాల్చుతూ, ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ, మారణాయుధాలతో రీల్స్ చేస్తూ విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక, విద్య నేర్పే గురువుల భయం లేక యువత పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సిరిసిల్ల పోలీస్ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ మార్గదర్శనంలో అక్రమ గాంజాపై ఉక్కుపాదం మోపడంతోపాటు సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది.

మత్తు పదార్థాలకు బానిసలు..

యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. కానీ జిల్లా వ్యాప్తంగా కొందరు విద్యార్థి దశ నుంచే చెడుదారిన పడుతున్నారు. మద్యం, సిగరెట్లు, ముఖ్యంగా గంజాయికి బానిసలుగా మారి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంకా ఆన్ లైన్ గేమ్స్‌లో జూదానికి అలవాటు పడి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఆన్ లైన్ యాప్‌లలో అప్పులు తీసుకుని, వారి వేధింపులకు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సమాజంలో చిన్న చూపునకు గురవుతున్నారు. అంతేకాకుండా నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవిస్తున్నారు.

రీల్స్ కోసం సాహసాలు..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రోజుకో మోడల్ పుట్టుకొస్తున్నారు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా బరితెగించి పిచ్చి, పిచ్చి పోస్టులు చేస్తున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రీల్స్ చేస్తున్నారు. సిగరెట్లు, మందు తాగుతూ పోస్టులు పెడుతున్నారు. సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఆత్మహత్యలకు గురవుతున్నారు. నిన్నటికి నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం మురైనలో రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

బైక్‌‌పై స్టంట్స్, మారణాయుధాలతో పోస్టులు

ఆధునిక కాలంలో యువత అనేక రకాల అవాంచిత కార్యకలాపాలతో వింత పోకడలను అనుసరిస్తున్నారు. ప్రమాదకరంగా బైక్ రైడింగులు చేస్తూ, మారణాయుధాలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనాలతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న తల్వార్, కత్తులు నిషేధిత మారణాయుధాలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన పట్టణానికి చెందిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఏది ఏమైనప్పటికీ నేటి భావి భారతపౌరులు దారి తప్పుతున్నారనేది వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని, పిల్లలకు డబ్బు విలువ తెలువనీయకుండా గారాబం చేసి అడిగిందల్లా కొనివ్వడం, చూసీచూడనట్లు విడిచిపెట్టడంతో భవిష్యత్తులో వారు దేనికి పనికి రాకుండా పోయి, సంఘ విద్రోహ శక్తులుగా మారుతారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి: డాక్టర్ పున్నం చందర్, మానసిక వైద్య నిపుణులు, సిరిసిల్ల

టీనేజీ పిల్లలపై హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, పేలవమైన పర్యవేక్షణ లోపం, శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడంలో విఫలం కావడంతోనే యువత పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రులు నిరంతరం యువతలో వచ్చే ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. వారికి సరైన సూచనలు చేస్తూ నడిపిస్తే మంచి పౌరులుగా తయారవుతారు. మంచి విషయం కంటే యువత ప్రతికూల విషయాలను తొందరగా స్వీకరిస్తారు. యువత సరైన దిశలో సాగేందుకు తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల పాత్ర కీలకం.

స్పెషల్ ఫోకస్ పెట్టాం: ఎస్పీ అఖిల్ మహాజన్

జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువతపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. సోషల్ మీడియాపై ప్రత్యేక నజర్ పెట్టాం. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా బైక్ రైడ్స్, మారణాయుధాలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో చట్ట విరుద్ధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్నాం. నిషేధిత మారణాయుధాలతో పోస్టులు చేస్తే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో గంజాయి సంపూర్ణ నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్నాం. ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించాం. అక్రమ ప్రవృత్తిని మార్చుకోకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయబోతున్నాం. గంజాయి రవాణా చేసినా, తాగినా 8712656392 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందించాలి.

Advertisement

Next Story

Most Viewed