మిల్లర్ల ఆస్తుల వేలానికి రంగం సిద్దం

by Prasanna |
మిల్లర్ల ఆస్తుల వేలానికి రంగం సిద్దం
X

దిశ, హుజూరాబాద్: గడువులోగా సీఎంఆర్ పెట్టని రైస్ మిల్లర్లతో పాటుగా వారికి గ్యారంటీ పడ్డ మిల్లర్ల ఆస్తులు వేలం వేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సెప్టెంబర్ చివరి నాటికి మిల్లర్లకు సీఎంఆర్ పెట్టడానికి ఇచ్చిన గడువు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు దాడులు ముమ్మరం చేస్తూ స్టాక్ పాయింట్ లను గుర్తిస్తున్నారు. జిల్లాలోని హుజూరాబాద్, శంకరపట్నం ,జమ్మికుంట ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వానికి సీఎంఆర్ బకాయి పడ్డట్లు గుర్తించిన అధికారులు బకాయి పడ్డ మిల్లర్లకు నోటీసులు ఇప్పటికే ఇచ్చారు. ప్రస్తుతం మిల్లులకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నిల్వలను గుర్తిస్తున్నారు. నిల్వల్లో తేడా ఉన్న మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెడుతూ వారికి సంబందించిన ఆస్తులను జప్తు చేస్తున్నారు. వారి ఆస్తులతో పాటుగా వారికి గ్యారంటీ పడ్డ మిల్లర్లకు సంబంధించిన ఆస్తులను సైతం వేలం వేయడానికి రంగం సిద్దం చేయడంతో గ్యారంటీ పడ్డమిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా మిల్లర్లకు ధాన్యం తీసుకోవడానికి గ్యారంటీ పడ్డ వారు సీఎంఆర్ పెట్టకుండా చేతులు ఎత్తేస్తున్న మిల్లర్ల విషయంలో ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా చాలా మంది మిల్లర్లు జిల్లా యూనియన్ లో నాయకత్వంలో ఉండి బినామీగా ఎవరో ఒక మిల్లర్ పేరుపెట్టి వారి పేరుతో ధాన్యం తీసుకొని బయట అమ్ముకుని కోట్లు సంపాదించిన వారే అధికంగా ఉన్నారు. ఇప్పుడు వారే ప్రభుత్వాన్నిబియ్యం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. వీరు తమ పలుకుబడి ఉపయోగించి తమకు తమ ప్రాంతం లోని మిల్లర్లను గ్యారంటీగా పెట్టించుకున్నారు. వాస్తవంగా ధాన్యం తీసుకొని సీఎంఆర్ కింద బియ్యం పెట్టడంలో ఆలస్యం అయినవారు ఇప్పుడు తమ ఆస్తులు అమ్ముకుని ప్రభుత్వానికి కడుతున్నారు. కానీ ప్రభుత్వం ధనాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్న వారు నేటికీ కొంత మంది ప్రభుత్వానికి బియ్యం పెట్టకుండా ఇటు దాని విలువకు డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారి విషయంలో అధికారులు వారికి గ్యారంటీ గా జమానత్ పడ్డ వారిపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఆస్తులు అమ్ముకుంటున్న మిల్లర్లు

హుజూరాబాద్, జమ్మికుంటలకు చెందిన కొంత మంది మిల్లర్లు తమ ఆస్తులు అమ్ముకుని ప్రభుత్వానికి సీఎంఆర్ కు బదులు డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని యూనియన్ నాయకులుగా చెలామణి అయిన వారు నేటికీ ప్రభుత్వాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. సీఎంఆర్ చెల్లించకుండా హైదరాబాద్ లో మకాం వేసి కాంగ్రెస్ పార్టీ లోని ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కొంత మంది ఉండగా మరికొంత మంది ఆసుపత్రిలో ఉన్నట్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు సమాచారం. దీనికి అధికారులు తమ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిసింది.

రూ.250కోట్ల మిల్లింగ్ చార్జీల బకాయిలు

ఇదిలా ఉండగా ప్రభుత్వానికి మిల్లర్లు బాకీ ఉన్న విషయం ఒక వైపు ఉండగా మరోవైపు మిల్లర్లకు బాకీ ఉన్న రూ.250 కోట్ల మేర బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా మిల్లర్ల ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. కస్టమ్ మిల్లింగ్ చేసిన చార్జీలను ప్రభుత్వం నుండి మిల్లర్లకు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉండగా గత ఆరు సంవత్స రాల నుండి మిల్లర్ల కు బాకాయి పడ్డ బకాయిలను ప్రభుత్వం చెల్లించక పోవడం మూలంగా వాస్తవంగా మిల్లింగ్ చేసి బియ్యం బాకీ లేకుండా సీఎంఆర్ పెట్టిన మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.

యూనియన్ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలి

ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ విషయం లో అధికారులు యూనియన్ నాయకుల పై ఒత్తిడి తీసుకురావాలని, అప్పుడే పూర్తి స్థాయిలో ప్రభుత్వ ధనం వసూలు అవుతుందని అంటున్నారు. మిల్లర్ల నుంచి గతంలో మామూళ్లు దండిగా పొందిన అధికారులు నేడు వసూలు విషయంలో పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకు రాలేక పోతున్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర విజిలెన్స్ అధికారులు ఈ విషయంలో రాష్ట్ర విజిలెన్స్ ఏసీపీ లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రావులకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దీంతో వీరు జిల్లాల్లో తిరుగుతూ కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కొంత మంది మిల్లర్లు దాడులకు జంకకుండా హైదరాబాద్ లో మకాం వేసి అధికార పార్టీ నాయకుల ప్రసన్నం కోసం చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story