నేషనల్ హైవే పనుల్లో నాణ్యతకు తూట్లు..! నిద్రావస్థలో పాలకులు, అధికారులు

by Shiva |
నేషనల్ హైవే పనుల్లో నాణ్యతకు తూట్లు..! నిద్రావస్థలో పాలకులు, అధికారులు
X

దిశ, బ్యూరో కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగిత్యాల- వరంగల్ నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో కాంట్రాక్టరు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అడుగడుగునా వివాదాస్పదంగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నిర్మాణం చేపడుతూ.. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నాడు. ఇప్పటికే గుట్టలను తొలచి అక్రమంగా మట్టిని తరలించుకున్న కాంట్రాక్టర్ గ్రానైట్ ప్లై‌యాష్‌తో నిర్మాణ పనులు చేసి విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాడు. తాజాగా కరీంనగర్ -వరంగల్ మధ్య బొమ్మకల్ శివారులో మానేరు‌పై నిర్మాణం చేపడుతోన్న బ్రిడ్జి సైడ్ వాల్స్ నిర్మాణం చేపడుతుండగానే పగుళ్లు వెలుగు చూడటం నేషనల్ హైవే నిర్మాణ పనులపై ఆందోళన కలుగుతోంది.

పట్టించుకోని అధికారులు

రూ.కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న నేషనల్ హైవే పనులను అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రహదారి పనుల్లో కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారి పనులు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి కావడం, స్థానిక నేతలకు ఆ పనులపై ఏ మాత్రం పట్టులేకపోవడం ఇందు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేతలు సమీక్షలతో సరిపెట్టడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, కాంట్రాక్టర్ కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతకు దగ్గరి బంధువు కావడంతో కాంట్రాక్టర్‌పై అజామాయిషి చేసేందుకు నేతలు సాహసించడం లేదని, ఆ విషయాన్ని ఆసరా చేసుకున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవరిస్తూ నిర్మాణపనులు చేస్తున్నాడని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

నిబంధనలకు తిలోదకాలు

కేంద్ర ప్రభుత్వంలో కీలక నాయకుడికి కాంట్రాక్టర్ బంధువు కావడంతో అధికారులు పనుల పర్యవేక్షించకుండానే అంతా ఓకే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టరు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినా అదే కరెక్ట్ అని అధికారులు సమర్థిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూ.కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న జాతీయ రహదారి మన్నికపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పనులను పర్యవేక్షించి పనులను నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed