ఇంటర్ టాపర్లను అభినందించిన జిల్లా కలెక్టర్

by Shiva |
ఇంటర్ టాపర్లను అభినందించిన జిల్లా కలెక్టర్
X

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అభినందించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లాలోని గురుకులాలలో చదువుకొని అత్యున్నత మార్కులు సాధించిన ఇంటర్ టాపర్లను జిల్లా కలెక్టర్ అభినందించారు.

జిల్లాలో ఉన్న మూడు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అద్భుతమైన ఇంటర్ ఫలితాలు వచ్చాయని, పెద్దపల్లి తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికలు జూనియర్ కళాశాల సీఈసీ 88%, ఎంఈసీ 58.5% మంథని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికలు జూనియర్ కళాశాల ఎంపీసీ 92.5%, బైపీసీ 95.5%, రామగుండం మైనారిటీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ 88%, బైపీసీ 66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వివరించారు.

జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందిస్తూ, నీట్ అర్హత పరీక్ష ఎలా వ్రాసారని, ఎంసెట్ పరీక్షలో కూడా రాణించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలో మైనారిటీ కళాశాలలో ఫెయిల్ అయిన విద్యార్థులపై శ్రద్ధ వహించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సప్లిమెంటరీ పరీక్షలో వారందరూ పాసయ్యే విధంగా అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్, పెద్దపల్లి తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికలు కళాశాల ప్రిన్సిపాల్ వై.సుజాత, రామగుండం మైనారిటీ గురుకుల బాలుర కళాశాల ప్రిన్సిపాల్ మిర్జా సిరాజ్ బేగ్, మంథని మైనారిటీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ అస్మా జబీస్, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story