సెస్ సొమ్ము అద్దె పాలు..

by Sumithra |
సెస్ సొమ్ము అద్దె పాలు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: అర్థ శతాబ్దానికి పైగా జిల్లాకు విద్యుత్ సరఫరా చేస్తూ, దేశంలోనే ఏకైక సహకార సంస్థగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నిలిచింది. అలాంటి చరిత్ర కలిగిన సంస్థ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారి వందల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయిన విషయం తెలిసిందే. కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రాల్లో వెలుగులు నింపిన సెస్ దాదాపు 600 కోట్లకు పైగా డిస్కంలకు బాకీ పడింది. అంతర్జాతీయ గుర్తింపు పొంది, జిల్లా అభివృద్ధికి వెన్నుముకలా ఉన్న సెస్ అప్పుల్లో కొట్టుమిట్టాడుతుంది. దాంతో సంస్థను ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని గత ఏడాది విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్ సి) ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విధితమే. అయితే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన సెస్ కు స్టోర్స్ నిర్వహణ గుదిబండలా మారుతుంది. సొంత స్థలం లేకపోవడంతో షెడ్లు అద్దెకు తీసుకొని లక్షల్లో కిరాయి చెల్లించవలసి వస్తోంది. ఉన్న స్థలాన్ని రైతు బజార్ కు ఇచ్చి లక్షల్లో అద్దె కట్టడం పై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.

రైతు బజార్ కు సెస్ స్థలం..

1970లో అప్పటి ప్రభుత్వం సిరిసిల్ల మానేరు వాగు నది తీరాన సుమారు రెండున్నర ఎకరాల భూమిని సెస్ కు కేటాయించింది. 1972లో పక్కనే ఉన్న చెన్నమనేని చుక్క రావు అనే వ్యక్తి వద్ద సంస్థ 22 గుంటల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిలో ఒక షెడ్డు నిర్మాణం చేసి విలువైన పరికరాలు, విద్యుత్ తీగలు, ఇతర పరికరాలను ఉంచి స్టోర్స్ కు వినియోగిస్తూ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా 2016లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థలాన్ని సెస్ నుండి తీసుకొని రైతు బజార్ నిర్మించింది. అప్పటినుండి దాదాపు 8 ఏళ్లుగా భవనాలు, పాత రైస్ మిల్లులు, షెడ్లు అద్దెకు తీసుకొని స్టోర్స్ కు వాడుతున్నారు.

ఏటా లక్షల్లో అద్దె..

2016 నుండి పట్టణంలోని కొత్త చెరువు కట్టకింద ఓ రైస్ మిల్లు అద్దెకు తీసుకొని సెస్ స్టోర్స్ నిల్వకు వాడింది. దానికి సంస్థ ప్రతి నెల 20 వేల రూపాయలు చెల్లించింది. ఇలా ప్రతి ఏటా కొంత అద్దె పెంచుతూ 2021 వరకు 50 వేల రూపాయలకు పైగా అద్దె చెల్లించింది. అయితే అప్పుడు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో స్టోర్స్ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది, దాంతో విలువైన సామాగ్రి పాడైపోయి సంస్థకు సుమారు 50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఆ స్థలం అణువుగా లేదని భావించిన సెస్ సంస్థ, 2021 నుండి పట్టణంలోని సాయి నగర్ కు చెందిన మరో రైస్ మిల్లును స్టోర్స్ ఉపయోగించింది. నెలకు 55వేలతో మొదలైన అద్దె ఏటా పెరుగుతూ సుమారు రూ. 80 వేలకు చేరింది.

నెలకు 1 లక్ష 40 వేల అద్దె

సాయి నగర్ లో స్టోర్స్ కు వాడిన షెడ్డు నుండి విలువైన సామాగ్రి దొంగలించబడుతుండడంతో స్టోర్స్ కు రక్షణ లేదని భావించిన సెస్ పాలకవర్గం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు అపారల్ పార్కులో చేనేత జోలి శాఖకు సంబంధించిన రెండు గోదాములను అద్దెకు తీసుకుంది. స్క్వేర్ ఫీట్ కు మూడు రూపాయల చొప్పున రెండు గోదాములకు కలిపి సుమారు 1 లక్ష 40 వేలకు పైగా చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికే అప్పులో కూరుకుపోయిన సెస్ కు ఇలా స్టోర్స్ వినియోగానికి లక్షల్లో అద్దె కట్టడం కత్తి మీద సాముల మారిందని అభిప్రాయాలు వినియోగదారుల నుండి వ్యక్తమవుతున్నాయి.

అనువైన స్థలంలో స్వంత షెడ్డు నిర్మించాలి.. బర్కం నవీన్ యాదవ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి

సెస్ స్టోర్స్ నిల్వకు ఒక గోదాం మాత్రమే సరిపోగా, అనవసరంగా రెండు గోదాములు అద్దెకు తీసుకున్నారు. దాంతో సంస్థ సొమ్ము వృధా అవుతోంది. గత పాలకవర్గం ఉన్న స్థలాన్ని అప్పటి ప్రభుత్వానికి అప్పగించి, మరోచోట స్థలాన్ని తీసుకురావడంలో విఫలమైంది. ఇప్పటికైనా సెస్ పాలకవర్గం, అధికారులు స్పందించి ప్రభుత్వం అనువైన స్థలం కేటాయించేలా చేసి, ఆ స్థలంలో స్టోర్స్ నిల్వకు ఒక షెడ్డు నిర్మాణానికి కృషి చేయాలి. దాంతో సంస్థకు అద్దెలు కట్టే బాధలు తప్పుడమే కాకుండా సంస్థ నష్టాల ఊబిలోంచి బయటపడే అవకాశాలు కలుగుతాయి.

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.. చిక్కాల రామారావు, సెస్ చైర్మన్

సెస్ కు సంబంధించిన దాదాపు 30 కోట్ల విలువ గల మూడెకరాల భూమిని గత ప్రభుత్వం గత పాలకవర్గ హయాంలో తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చేలా మా పాలకవర్గం తరపున ఒత్తిడి తెస్తాం. దాంతోపాటు స్టోర్స్ నిలువ చేయడానికి రెండు పెద్ద షెడ్లు ప్రభుత్వమే నిర్మించి, రక్షణ కోసం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి ఇవ్వాలని కోరుతాం. నిల్వ ఉంచిన విలువైన సామాగ్రికి రక్షణ లేకపోవడం వల్లనే ప్రభుత్వ చొరవతో చేనేత జౌళి శాఖకు సంబంధించిన రెండు గోదాములను అద్దెకు తీసుకున్నాం. ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దె కంటే తక్కువే చెల్లిస్తున్నాం. స్టోర్స్ నిల్వ ఉంచడానికి ఒక్క గోదాము మాత్రమే సరిపోతే, మరోదానిని తిరిగి చేనేత జౌలి శాఖకు అప్పగిస్తాం. దాంతోపాటు సెస్ లాభాల బాటలో నడవడానికి మా పాలకవర్గం వంతు కృషి చేస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed