మవోయిస్ట్ పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ నేరేళ్ల జ్యోతి లొంగుబాటు

by Shiva |   ( Updated:2023-05-12 12:14:56.0  )
మవోయిస్ట్ పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ నేరేళ్ల జ్యోతి లొంగుబాటు
X

కరీంనగర్​ సీపీ ఎదుట సరెండర్

లొంగిపోయిన మవోయిస్ట్ లకు పునరావాసం కల్పిస్తాం : కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు

దిశ, కరీంనగర్ బ్యూరో : మవోయిస్ట్ పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ నేరేళ్ల జ్యోతి శుక్రవారం కరీంనగర్ సీపీ సుబ్బా రాయుడు ఎదుట లొంగిపోయారు. జ్యోతి లొంగుబాటుతో దాదాపు 20 ఏళ్ల అజ్ఞాత జీవితానికి తెరపడినట్లైంది. ఈ సందర్భంగా కరీంనగర్​ సీపీ సుబ్బారాయుడు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని శివంగులపల్లి గ్రామానికి చెందిన జ్యోతి 2004లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో మావోయిస్ట్ పార్టీ పాటలు, సిద్ధాంతాలకు ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు తెలిపారు.

అడవివదిరలోని తన అక్క దగ్గరికి వెళ్లిన సమయంలో గ్రామంలో మావోయిస్టులు నిర్వహించిన మీటింగ్ లో పాల్గొని, అప్పటి దళ కమాండర్ రఘు ఆధ్వర్యంలో దళంలోకి వెళ్లినట్లు ఆయన వివరించారు. కొద్దిరోజులు సిరిసిల్ల ఏరియాలో పని చేసి జ్యోతి మానాల ఎన్ కౌంటర్ జరిగిన తరువాత, ఆదిలాబాద్ జిల్లా మంగి దళంలోకి వెళ్లినట్లు ఆయన తెలిపారు. 2011లో ఆదిలాబాద్ జిల్లాలోని కర్రిగుట్ట ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ తరువాత జంపన్నతో కలిసి ఒడిశా రాష్ర్టానికి వెళ్లినట్లు సీపీ వివరించారు.

అక్కడ ప్రెస్ కమిటీ మెంబర్ గా పని చేసిందని పార్టీలో పనిచేస్తూ, ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ ను వివాహం చేసుకున్నట్లు సీపీ వివరించారు. 2012లో అతడి నుంచి విడిపోయి సుమారు 20 ఏళ్లు వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో మూడు రాష్ట్రాలలో పని చేసిందని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రెస్ ఇన్ చార్జి తెలంగాణ రాష్ర్ట కమిటీలో డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ హోదాలో పని చేస్తుందని వెల్లడించారు.

లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునే దళ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గానీ, స్వయంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో లేదా, జిల్లా ఉన్నతాధికారుల వద్ద గాని సంప్రదించినట్లయితే లొంగుబాటుకు ఏర్పాట్లు చేస్తామని సీపీ తెలిపారు. వారికి జీవనోపాధి కోసం పునరావాసం కల్పించి ప్రభుత్వం తరపున అన్నిరకాల ప్రతిఫలాలను అందజేస్తామని హమీ ఇచ్చారు. లొంగిపోయిన నేరెల్ల జ్యోతిపైన ఉన్న రూ.5 లక్షల రూపాయల రివార్డు, నగదు మరియు ప్రభుత్వం తరపున పునరావాసం, జీవనోపాధి మరియు ఇతర ప్రతిఫలాలు అందజేస్తామని సీపీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: భూమి పత్రాలు ఫోర్జరీ.. కలెక్టరేట్ ఎదుట బాధితుడి ఆత్మహత్యాయత్నం

Advertisement

Next Story

Most Viewed