సిరిసిల్లలో కమలం ఢీలా.. ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్న నేతలు

by Anjali |   ( Updated:2023-11-15 06:06:36.0  )
సిరిసిల్లలో కమలం ఢీలా.. ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్న నేతలు
X

సిరిసిల్లలో బీజేపీ పార్టీ ఢీలా పడుతోంది. శాసనసభ ఎన్నికలవేళ నియోజకవర్గంలో కమలం నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముందు నుంచి సిరిసిల్ల బీజేపీ టికెట్ ఆశించిన బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్‌కు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ సిరిసిల్ల నేతలకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల బరిలో లగిశెట్టి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచాడు. మరోవైపు టికెట్టు ఆశించిన మరో ముగ్గురు కీలక నేతలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. వారి వెంట పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో సిరిసిల్లలో బీజేపీ ఖాళీ అవుతుంది. ఇదిలా ఉండగా రాణి రుద్రమారెడ్డికి టికెట్ ఇవ్వడంతో సిరిసిల్ల నేతల్లో అసంతృప్తి మొదలైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి చివరకు డిపాజిట్​ దక్కితే ఎక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గంలో కమలం పార్టీ రోజురోజుకూ ఢీలా పడుతోంది. ఎన్నికల సమయంలో ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండడంతో సిరిసిల్లలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ మనుగడ ప్రశ్నర్ధకంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్​కు సన్నిహితుడిగా ఉన్న లగిశెట్టి శ్రీనివాస్​ బీఆర్​ఎస్​ పార్టీని వీడి బీజేపీలో చేరారు. సిరిసిల్లలో బలమైన సామాజిక వర్గం అయిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్​కు బీజేపీ టికెట్​ వస్తుందని అందరు భావించారు. టికెట్ల కేటాయింపులో లగిశెట్టి శ్రీనివాస్​కు కాకుండా రాణి రుద్రమకు కేటాయించారు. స్థానిక నేతకు కాదని నాన్​ లోకల్​ వ్యక్తికి టికెట్​ కేటాయించడంతో సిరిసిల్ల బీజేపీలో అసంతృప్తి మొదలైంది. లగిశెట్టి శ్రీనివాస్​ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలువగా టికెట్టు ఆశించిన మరో ముగ్గురు కీలక నేతలు బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడంతో సిరిసిల్లలో బీజేపీ ఖాళీ అవుతుంది.

రుద్రమ తీరే కారణమా..?

బీజేపీ సిరిసిల్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాణి రుద్రమ నిర్ణయాలు సైతం పార్టీకి నష్టం చేకుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలోని నలుగురికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ కీలక బాధ్యతలను బీఆర్​ఎస్​ పార్టీకి అనుకులంగా ఉండే కొందరు వ్యక్తులకు అప్పగించినట్లు బీజేపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో సదరు నేతల నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని ప్రచారం జరుగుతోంది.

నేతల తీరు వల్ల పార్టీలోని ముఖ్యనేతలు, కార్యకర్తలు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. సిరిసిల్లలో వాడుతున్న కమలానికి కొత్త జోష్ నింపడానికి నిర్వహించిన బండి సంజయ్ రోడ్డు షోకు హాజరైన కార్యకర్తలు, నాయకులకు కనీసం రవాణా సౌకర్యం సైతం కల్పించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో బీజేపీ పార్టీకి డిపాజిట్​ దక్కే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ మారుతున్న నేతలు..

పార్టీ కోసం, ప్రజల కోసం పోరాడి ఏదో చిన్నా చితక పదవుల్లో ఉన్న బీజేపీ నేతలు అందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బీఆర్​ఎస్​ పార్టీలో చేరుతున్నారు. వెయ్యి నుంచి 2వేల ఓట్ల వేయించే సత్త ఉన్న పలువురు నేతలు పార్టీ మారడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఇలా ముఖ్య నేతలు అందరు పార్టీ మారుతుండడంతోపాటు బీజేపీ అధిష్టానం చొరవ తీసుకుని లగిశెట్టి శ్రీనివాస్​ నామినేషన్​ ఉపసంహరించుకోవాలని కోరకపోవడంతో ఎన్నికల లోపు సిరిసిల్లలో బీజేపీ పార్టీ కనుమరుగు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed