'బీఆర్ఎస్ కు వణుకు మొదలైంది'

by Sumithra |
బీఆర్ఎస్ కు వణుకు మొదలైంది
X

దిశ, సిరిసిల్ల : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు కావడంతో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో వణుకు మొదలైందని, పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని గుబులు పడుతున్నారని సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జీ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాటలను ఖండించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో శనివారం సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రెండు పథకాలను అమలు చేయడానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రజలకు వర్తింపజేశారని, శనివారం నుండే పలుఆసుపత్రుల్లో అర్హత కలిగిన వారికి అమల్లోకి వచ్చిందన్నారు.

అదే మాదిరిగా తెలంగాణ ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారన్నారు. ఈ పథకాల అమలు చూసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు చెమటలు పట్టాయని, వారి హయాంలో రాష్ట్ర ఖజానాను దివాళ చేశారని ఎద్దేవా చేశారు. అందుకే 6 గ్యారంటీల అమలు సాధ్యం కాదని హరీష్ రావు అనుకున్నారని, ఊహించని విధంగా పథకాలను అమలు చేస్తుంటే వారికి వణుకు మొదలైంది అన్నారు. వాళ్ళ పార్టీ ఉనికి ఎక్కడ ప్రశ్నార్ధకమవుతుందోనని భయంతో లేనిపోని విమర్శలు చేయడం మొదలు పెట్టారన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే ఉచిత సలహాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని వర్గాలకు అండగా ఉండే పార్టీ అని భారత దేశ చరిత్ర చెప్తుందన్నారు. బ్యాంకుల జాతీయకరణ నుండి పేద ప్రజలుకు పనికి ఆహార పథకం కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.

అంతేకాకుండా రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రు.7,500 ఇచ్చే శక్తి ఉందని రెండు దపాలకు రు.15,000 వేలు అందజేస్తామన్నారు. దీంతో పాటు రైతు భరోసా కల్పిస్తూ రెండు లక్షల రుణమాఫీ చేస్తూ, రైతు వ్యక్తి వడ్డీ వ్యాపారి చేతుల్లోకి వెళ్లకూడదని వడ్డీ లేని రుణం కింద మూడు లక్షల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తూచా తప్పకుండా సరైన సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కాకముందే బీఆర్ఎస్ విమర్శలు సరైంది కాదని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు మాటల్లోనే ఉన్నాయని, ప్రశ్నించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖను దివాళి తీయించి రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టి, ప్రతి వ్యక్తి పైన, పుట్టే బాబు పైన కూడా రు. 1,50,000 అప్పు చేసిన ఘనత ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందేనని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఐదు లక్షల కోట్ల అప్పుకు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వనరులు సమకూర్చుకొని సరైన సమయంలో రైతులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతు భరోసా కొనసాగిస్తామన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story