- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజన్న.. ఇదేందయ్యా..ఆలయంలో గాడి తప్పుతున్న పాలన?
దిశ, వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పాలన పట్టాలు తప్పుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించి రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తుంది. మరోవైపు కొంతమంది ప్రజాప్రతినిధులు, మరికొంతమంది ఆలయ అధికారుల తీరు ప్రభుత్వ ఆశయానికి గండి పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ‘పరమేశ్వరుడి’ పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం ఆశయం అలా.. ఆలయంలో ఇలా..
వాస్తవానికి గత బీఆర్ఎస్ పదేళ్ల పాలన ముగిసి, ఏడాది కిందట కాంగ్రెస్ పార్టీ పాలన పగ్గాలు చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధికి ఎన్ని నిధులైన కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా గత నెలలో సీఎం రేవంతే స్వయంగా వేములవాడ పర్యటనకు వచ్చి రూ.127కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆలయ అభివృద్ధిపై అందరిలో ఆశలు చిగురించాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా అసలు కథ ఇక్కడే మొదలైనట్లు తెలుస్తోంది.
రోజుకో ఇష్యూతో వార్తల్లోకి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆలయంలో పెను మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ సుదీర్ఘకాలం ఇక్కడే పాతుకుపోయిన అధికారులను, సిబ్బందిని బదిలీ చేయడమే కాకుండా గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి పూర్తిస్థాయి కార్యనిర్వాహక అధికారిని కేటాయించారు. అంతేకాక పాలనను చక్కదిద్దేందుకు సాహసోపేత నిర్ణయమే తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఇక ఆలయ పాలన గాడిలో పడినట్లేనని భావించారు. అయితే భక్తుల్లో ఈ భావన కలిగి రోజులు గడవక ముందే మళ్లీ పాత రోజులను గుర్తు చేసేలా రోజుకో ఇష్యూతో వార్తల్లో నిలుస్తోంది రాజరాజేశ్వరుడి క్షేత్రం.
మంత్రి సురేఖ పర్యటనతో మొదలు..
నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో మొదట ఆలయ పాలన సాఫీగా సాగుతున్నట్లే అనిపించింది. కానీ ఎప్పుడైతే దేవాదాయ శాఖ మంత్రి హోదాలో కొండా సురేఖ ఆలయంలో అడుగుపెట్టిందో ఇక అప్పటి నుంచి ఆలయంలో నిత్యం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. రెండు నెలల కింద తన మనువడి పుట్టు వెంట్రుకల మొక్కుతో మొదలైన ఈ తతంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునే క్రమంలో మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చింది. ఈ క్రమంలో మంత్రితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గంటల తరబడి ఆలయ గర్భగుడిలోనే ఉండి పూజలు నిర్వహించారు.
దీంతో ఆ రోజు స్వామివారికి సమర్పించే నైవేద్యం ఆలస్యంగా వెళ్లింది. అప్పట్లో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత కోడెల పంపిణీ విషయంలోనూ అక్రమాలు జరగడం, అందులోనూ మంత్రి కొండా సురేఖ అనుచరుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, ఇది చాలదన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా లెక్కకు మించి ఖర్చుల వంటి విషయాలు బయటకు రావడం, ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సంఘటనలుగా మిగిలిపోయాయి. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందోననే చర్చకు దారితీస్తున్నాయి.
ఆందోళన వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు..
దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో నిత్యం ఏదో ఒక సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉందని, ఎంతో విశిష్టత కలిగిన ఆలయంపై నిత్యం ఇలాంటి వార్తలు వస్తే భక్తుల మనోభావాలు దెబ్బ తినడమే కాకుండా ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాల నాయకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రాజన్న ఆలయ పాలన పై ప్రత్యేక దృష్టి సారించాలని, లేదంటే రాబోయే రోజుల్లో రాజన్న ఆలయ ప్రతిష్ట మరింత దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని..
ఇక ఇవన్నీ విషయాలు ఇలా ఉంటే ఎంతో విశిష్టత కలిగి, పేద భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న రాజన్న ఆలయ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు కావాలనే అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారు వారి విధానాలను మానుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాల ఆరోపణలు చేసిన వాటిలో ఏది నిజ నిర్ధారణ కాలేదని, రాజన్న ఆలయం పై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలు కానీ వాస్తవాలను బయటపెట్టి భక్తులకు నిజానిజాలను తేల్చి చెప్పాలే తప్ప అనవసరపు ఆరోపణలు చేసి "రాజన్న ఆలయాన్ని రాజకీయ కేంద్రం"గా మార్చవద్దని వేడుకుంటున్నారు.