చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు

by Shiva |
చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు
X

ఆయిల్ ఫాం సాగు లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ

వీసీలో అధికారులతో సీ.ఎస్ శాంతి కుమారి

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు, మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, సీఎంఆర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇళ్ల స్థలాల వివరాలు అప్ లోడింగ్, పట్టణ ప్రాంతాల్లో రెండు పడక గదుల నిర్మాణం, జీవో నెం.58, 59, 76, 118 ప్రకారం చేయవలసిన క్రమబద్ధీకరణ, ఆయిల్ ఫాం సాగు, ఎరువుల పర్యవేక్షణ వ్యవస్థపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కంటి వెలుగు, ఆరోగ్య మహిళా శిబిరాలను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ.. నాణ్యమైన సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరపై కొనుగోలు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర మౌలిక వసతులు కల్పించాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ రైస్ డెలీవరీపై జిల్లాల వారీగా సీఎస్ రివ్యూ నిర్వహించారు. అధికంగా పెండింగ్ ఉన్న జిల్లాలు పది రోజులో మిగిలిన జిల్లాలు 3 రోజుల్లో సీఎంఆర్ రైస్ డెలీవరీ చేయాలని సీఎస్ తెలిపారు. జీవో నెం.58 కింద పట్టాల పంపిణీ కార్యక్రమం మూడు రోజులో పూర్తి కావాలని, జీవో నెం.59 కింద దరఖాస్తుదారులు రూ.3 లక్షల లోపు రుసుము చెల్లించాల్సి ఉందని, వచ్చే వారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రుసుము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

జీవో నెం.76 కింద పెండింగ్ ఉన్న దరఖాస్తులు వచ్చే వారం నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల వరకు విస్తీర్ణంలో ఆయిల్ ఫాం సాగు చేశారని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం 2 లక్షల పైగా ఎకరాల లక్ష్యంతో కార్యాచరణ తయారు చేశామని, ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించుకోని వాటి సాధన దిశగా కృషి చేయాలని సీఎస్ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీవో పవన్ కుమార్, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఉద్యానవన అధికారిణి జ్యోతి, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story