వాహనదారులు బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి

by Sridhar Babu |
వాహనదారులు బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవడం వాహనదారుల కనీస బాధ్యతని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా పోలీస్, రోడ్డు రవాణా శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన లైసెన్స్ మేళాలో పాల్గొన్న డెబ్బై మంది యువతి, యువకులకు శనివారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజాన్, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ లతో కలిసి డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు పారితోషకం అందించడంలో డ్రైవింగ్ లైసెన్స్ ముఖ్యమని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్సులను కలిగి ఉండాలని,

తాను కూడా తన డ్రైవింగ్ లైసెన్సును రెన్యువల్ చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు అంటేనే శాంతి భద్రతలకు, సేవా కార్యక్రమాలకు నిదర్శనమని, సమాజంలో సాంప్రదాయాలకు పోలీస్ శాఖ అద్దం పడుతుందన్నారు. పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణ కల్పిస్తూ, మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్ మేళా పెట్టి లైసెన్సులు అందజేయడం అభినందనీయమని కొనియాడారు.

యువత సామాజిక స్పృహ, క్రమశిక్షణతో పోలీసులకు సహకరించి, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై ఉక్కు పాదం మోపడానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిందని, యువత గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు, ఆ శాఖల సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed