ఆ జిల్లా ప్రజలు తెలంగాణ పౌరులు కారా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2023-01-19 13:14:04.0  )
ఆ జిల్లా ప్రజలు తెలంగాణ పౌరులు కారా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
X

దిశ, సారంగాపూర్: ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షలు కేటాయించాలని జగిత్యాల జిల్లా అంటే ముఖ్యమంత్రికి ఎందుకింత వివక్షని మండిపడ్డారు. ఈ జిల్లా పౌరులు తెలంగాణ పౌరులు కారా.. అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు బిల్లులు రాక పలువురు సర్పంచులు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. వారి చావులు సీఎం కేసీఆర్‌కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షలతో పాటుగా మేజర్ గ్రామ పంచాయితీలకు పది కోట్లు, నూతనంగా మున్సిపాలిటీలుగా ఏర్పడ్డ ధర్మపురి, రాయికల్ కు 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని, బీఆ‌ర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వాటిని బలోపేతం చేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చే బడ్జెట్‌లో 1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మూతబడిన చక్కెర ఫ్యాక్టరీని పున ప్రారంభించాలని అలా చేయని పక్షంలో కేసీఆర్‌కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రామచంద్ర రెడ్డి, రాజి రెడ్డి, సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed