మహిళలు రాజకీయంగా ఎదగడం ఎమ్మెల్యేకు నచ్చదు : బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోగ శ్రావణి ఆరోపణ

by Shiva |
మహిళలు రాజకీయంగా ఎదగడం ఎమ్మెల్యేకు నచ్చదు : బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోగ శ్రావణి ఆరోపణ
X

శిలాఫలకంపై జడ్పీ చైర్ పర్సన్ పేరు గల్లంతు

'హింసించే ఓ పులికేసి' ఎమ్మెల్యే సంజయ్ కుమార్

దిశ, జగిత్యాల ప్రతినిధి : మహిళలు రాజకీయంగా ఎదగడం జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ కు నచ్చదని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బీజీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భోగ శ్రావణి ఆరోపించారు. ఆదివారం నిర్వ హించిన కేంద్ర గిడ్డంగుల, 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ శంకు స్థాపన కార్యక్రమంలో ఏర్పాటుచేసిన శిలాఫలకంపై జడ్పీ చైర్ పర్సన్ పేరు లేకపోవడంపై ఆమె స్పందించారు.

ఈ మేరకు మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. వీడియోలో శ్రావణి మాట్లాడుతూ శిలాఫలకంపై బహుజన మహిళ అయిన జడ్పీ చైర్పర్సన్ పేరు తొలగించడం వెనక కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. ప్రోటోకాల్ విషయంలో ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉంటుందని జరిగిన తప్పుకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఓ 'హింసించే పులికేసి' అని ఆయనకు బహుజనులు అంటే చులకన అంటూ తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు.

ఎమ్మెల్యే సంజయ్ బహుజనులను రాజకీయంగా ఎదగనీయరని, కేవలం సబ్బండ వర్గాల ఓట్లు మాత్రమే కావాలంటూ చురకలంటించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న తనను అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు వేధించడం వల్లనే రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా చేసి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా కౌన్సిల్ లో ఉన్న మిగితా 11 మంది బీసీ మహిళ కౌన్సెలోర్లను కాదని ఒక ఓసి సామాజిక వర్గానికి చెందిన వారికి చైర్మన్ గా బాధ్యతలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఖాళీగా ఉన్న రూరల్ అర్బన్ ఎంపీపీ పదవులను కూడా రిజర్వేషన్లకు విరుద్ధంగా ఇతరులకు కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే సంజయ్ మహా నటుడని అలాంటి ఎమ్మేల్యేకు మహిళ దినోత్సవం నిర్వహించే అర్హత లేదని హితువు పలికారు. ఎమ్మెల్యే అసలు రంగు మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముందు బయటపడిందన్నారు. ప్రజలు ఎమ్మెల్యే తీరును గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.

Advertisement

Next Story