ప్రణవ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Mahesh |
ప్రణవ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు, రైస్ మిల్లర్లు, ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశాడని, పూర్తి ఆధారాలతో చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నానని, నీకు ధైర్యం ఉంటే నీవు కూడా వచ్చి డబ్బులు తీసుకోలేదని ఆంజనేయుని పై ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు. ఈ సవాల్ ను స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను చెల్పుర్‌కు వస్తున్నట్లు చెప్పడంతో చేల్పుర్ ఏమి జరుగుతుందో అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. వీరు రావడమే కాకుండా వీరి అనుచరులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటుందనే అనుమానం కలుగుతుంది. గతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలాంటి వాతావరణం ఉండేది. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయి రెడ్డి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు తాత సింగాపురం రాజేశ్వరరావు వర్గం మధ్య హోరాహోరీ పోరాటం జరిగేది.

ఇద్దరు కాంగ్రెస్‌లో ఉండటంతో టికెట్ కోసం వీరి మధ్య ఆధిపత్య పోరాటం జరిగేది. రాజేశ్వర రావు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కు ఆత్మీయుడు గా ఉండటం, సాయిరెడ్డి వైఎస్‌కు దగ్గరగా ఉండటంతో ఒకరు రాష్ట్ర రాజకీయాల్లో, మరొకరు దేశ రాజకీయాల్లో ఉండటంతో వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. వీరు ఎప్పుడు మీటింగ్‌లు పెట్టుకున్నా గొడవలు జరిగేవి. చివరికి రాళ్ల దాడి వరకు వెళ్ళింది. అలాంటి దశలో చివరికి బీఅర్ఎస్ రావడంతో సింగపురం రాజేశ్వర్ రావు(ప్రణవ్ బాబు తాత)కు కేసీఆర్ ఆత్మీయుడు గా మారడం, ఆయన ఇంట్లోనే తెలంగాణ ఉద్యమ వ్యూహాలు పురుడు పొసుకోవడంతో పాటుగా సాయిరెడ్డి ఆయన సోదరుడు సుదర్శన్ రెడ్డిలు మృతి చెందడంతో నియోజక వర్గంలో కెప్టెన్ వర్గం ఆధిపత్యం మొన్నటి వరకు ఉండేది. మొన్నటి ఎన్నికల్లో కెప్టెన్ కుటుంబం తో విభేదించి హుజురాబాద్ నుండి ప్రణవ్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది.

ఈ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బిఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటి నుంచి హుజురాబాద్‌లో ప్రణవ్, కౌశిక్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పుడు ప్రణవ్‌కు మంత్రి పొన్నం అండ పుష్కలంగా ఉంది. కౌశిక్‌కు కెప్టెన్ వర్గం అండ దండలు ఉన్నాయి. దీంతో వీరి మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం నడుస్తుంది. తాజాగా పొన్నంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటుగా ప్రణవ్ బాబు కౌంటర్ ఛాలెంజ్ చేయడం, ఇద్దరు చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదిక చేసుకోవడంతో ఈ రోజు 11 గంటలకు అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. పోలీసులు ముందుగానే చెల్పూర్‌కు వెళ్లి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed