రైతులను నిలువునా.. దోచుకుంటున్న మిల్లర్లు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
రైతులను నిలువునా.. దోచుకుంటున్న మిల్లర్లు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

ఒక్క మిల్లునైనా.. బ్లాక్ లిస్ట్ లో పెట్టారా..?

దిశ, జగిత్యాల ప్రతినిధి : ధాన్యం తూకంలో క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తూ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, తూకానికి, లారీల ట్రక్ షీట్ కి మధ్య వ్యత్యాసం ఉంటుందని, అలా కాకుండా ధర్మకాంట ఆధారంగా చెల్లింపులు చేస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు.

మిల్లర్లు అన్ లోడింగ్ చేసుకోకుండా జాప్యం చేయడంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం ప్రక్రియ నిలిచిపోతోందన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న మిల్లర్ల విషయంలో సంబంధిత మంత్రి ఒక్క మిల్లునైనా.. బ్లాక్ లిస్ట్ లో పెట్టారా అంటూ ప్రశ్నించారు. ఎన్ని మిల్లులకు షోకాజ్ నోటీసులు పంపించారని ఎద్దేవా చేశారు. మిల్లర్ల దోపిడీ అదుపు చేయాలంటే ఇక్కడి ధాన్యాన్ని అవసరం ఉన్న పొరుగు జిల్లాలకు పంపించాలని కోరారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రైతులకు బోనస్ ఇచ్చామని రానున్న రోజుల్లో అధికారంలో రాగానే ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు క్వింటాల్ కు రూ.2,500 మద్దతు ధర ఇస్తామని తెలిపారు. అంతే కాకుండా రైతు భీమాతో పాటుగా రైతు కూలీలకు, కార్మికులకు భీమా కల్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed