కారుకు ఓటు వేయకుంటే ప్రజల కళ్ళుపోతాయి : కేటీఆర్

by Sumithra |   ( Updated:2023-11-27 15:49:03.0  )
కారుకు ఓటు వేయకుంటే ప్రజల కళ్ళుపోతాయి : కేటీఆర్
X

దిశ, వెల్గటూర్ : నవంబర్ 30 న ప్రజలందరూ కారుకే ఓటు వేయాలని, లేదంటే కళ్లుపోతాయని మంత్రి కేటీఆర్ ప్రజలకు శాపం పెట్టారు. అలాగే కరెంటు కావాలంటే కాగ్రెస్ కు ఓటు వేయొద్దని మరిచిపోయి కాంగ్రెస్ కు వేస్తే సచ్చిపోతారని తిట్ల దండకాన్ని అందుకున్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబోతున్నవి చెప్పడానికి ఇచ్చే ప్రాధాన్యత కన్నా ప్రతిపక్ష కాంగ్రెస్ ను తిట్టడానికే కేటీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు ప్రతిపక్ష నాయకుల పై, కేసీఆర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన కేటీఆర్ రోడ్ షోకు పెద్ద మొత్తంలో విచ్చేసిన ప్రజలకు ఆయన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పి ప్రసంగాన్ని ప్రారంభించారు. రైతులకు రైతుబంధు రాకుండా కాంగ్రెస్ మోకాలు అడ్డుపెట్టిందని విమర్శించారు. దేశంలోనే చిల్లర పార్టీ అంటే కాంగ్రెస్ అందులోని నాయకులని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలని అంటే, ఉత్తం కుమార్ రెడ్డి రైతులకు రైతుబంధు ఇవ్వడం వృధా అని అంటారు. మల్లు భట్టి విక్రమార్క ధరణిని తీసివేస్తామని ప్రకటిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బట్టలు చింపుకొని ఏడుస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండని వేడుకుంటున్నారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అధికారం కోసం ఆరాటం తప్ప వీరిలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన శూన్యమని అన్నారు. ఇప్పటికే 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి గోస పడ్డాము. ఆలోచించి ఓటు వేయండి, మరోసారి వారికి అవకాశం ఇస్తే చీకటి రోజులు కొని తెచ్చుకోవడమే అవుతుందన్నారు. మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ఏం చేసింది ఇందిరమ్మ, ఆమె పాలనలో కూడు గుడ్డ కోసం ప్రజలు అలమటించిన విషయం మరిచిపోయారా అని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత మరో 10 రోజులు అయితే మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, అర్హులైన వారందరికీ కొత్తరేషన్ కార్డులు పెన్షన్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు.

అత్తా కోడళ్ళ పంచాయతీ లేకుండా సౌభాగ్య లక్ష్మి కింద అత్తకు 5000, కోడలుకు 3000 అందజేస్తున్నామని హామీ ఇచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనతో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేశామని ప్రకటించారు. నియోజక వర్గంలోని అందరికి దళిత బంధు ఇస్తామని వాగ్దానం చేశారు. 24 గంటల కరెంటు పై ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, వారందరి కోసం నేనే రెండు బస్సులు పెడతా ధర్మపురి మండలంలో ఏ గ్రామానికైనా వెళ్లి లైన్ గా నిలబడి కరెంటు తీగలు ముట్టుకొని చూడాలని, అప్పుడు తెలుస్తుంది కరెంటు ఉందో లేదో అని మనకు కూడా కాంగ్రెస్ దరిద్రం పోతుందని విమర్శించారు. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతున్నాము, రైతుబంధును 10,000 నుంచి 16 వేలకు పెంచుతున్నామని కేటీఆర్ ప్రకటించారు. ధర్మపురిలో కారు గుర్తుకు ఓటు వేసి ఈశ్వరన్నను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed