- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వతంత్ర పోరులో.. కీలక పాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : దేశమంతా ఆంగ్లేయులను పారదోలేందుకు ఉద్యమిస్తున్న సమయంలో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న పరిస్థితులు వేరు. హైదరాబాద్ సంస్థాన్ ప్రాంత యువత నిజాం ప్రభువును గద్దె దింపేందుకు ఖాసీం రజ్వీ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూనే.. జాతీయోద్యమానికీ తమ సంఘీభావం తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతస్తులు తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తే.. నిజాం పాలిత ప్రాంత ప్రజలు మాత్రం అటు జాతీయోద్యమానికి, ఇటు ప్రాంతీయోద్యమానికి ఊపిరిపోశారు. ఈ క్రమంలోనే పీవీ నరసింహ రావు, బోయినపల్లి వెంకట్రామారావు, సీహెచ్ రామారావు, చెన్నమనేని రాజేశ్వర్ రావు, జువ్వాడి గౌతం రావు వంటి అనేక మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాతీయస్థాయి నేతలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తమ వంతుగా సంఘీభావం అందించారు. ఈ క్రమంలోనే విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ ప్రతిష్టాన్.. స్వతంత్ర పోరాటంలో అత్యంత కీలక భూమిక పోషించింది.
ఖాదీ ప్రతిష్టాన్‌లో కీలక భూమిక..
నిజానికి జాతీయోద్యమంతో సంబంధం లేకున్నప్పటికీ హైదరాబాద్ సంస్థాన్‌లోనూ ఖాదీ భండార్‌లు వెలియడం ఈ ప్రాంత ప్రత్యేకత అని చెప్పాలి. 1929లో వావిలాల ఖాదీ భండార్‌ను స్థాపించి.. ఇక్కడే నేసిన వస్త్రాలను దేశ వ్యాప్తంగా పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో మొదటి స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలుస్తున్న 'వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్'.. స్వాతంత్య్ర పోరాటం నుంచి కూడా బట్టల తయారీలో తనదైన ముద్ర వేసుకుంది.
జాతీయ జెండాలు ఇక్కడి నుంచే..
ఎర్రకోట, పార్లమెంట్ భవనాలపై ఎగరేసే జాతీయ జెండాలను సైతం గతంలో ఇక్కడి నుంచే పంపించేవారంటే వావిలాల ఖాదీ భండార్ ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. ఇక మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన అఖిల భారత చరఖా సంఘానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా అనేక ఖాదీ వస్త్ర తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే ఇండియన్ స్టేట్స్‌తో సంబంధం లేకుండా నిజాం పరిపాలిత ప్రాంతంగా ఉన్న హైదరాబాద్ స్టేట్‌లో గాంధీజీ శిష్యులైన రామానందతీర్థ, లేలేజి ద్వారకానంద, సహస్త్రబుది, పాంగ్రేకర్ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి వావిలాలను కూడా ఎంపిక చేసింది.
2005-2006లో జాతీయ స్థాయి అవార్డులు
1929లో స్వామి రామానందతీర్థ ఆధ్వర్యంలో వావిలాలలో ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ ఏర్పాటైంది. 1947 నుంచి 1950 వరకు అఖిలభారత చరఖా సంఘం ఆధ్వర్యంలో సేవలందించింది. 1951 నుంచి హైదరాబాద్ సమితి ఆధ్వర్యంలో దుస్తుల తయారీకీ శ్రీకారం చుట్టింది. ఇక వావిలాల ఖాదీ ప్రతిష్టాన్‌కు తొలి అధ్యక్షునిగా రామానందతీర్థ బాధ్యతలు నిర్వర్తించగా.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మరణించే వరకు రెండో అధ్యక్షునిగా వ్యవహరించారు. సుమారు 1100 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నేత కార్మికుడు కనుకయ్య, నూలు వడికె పాడిశెట్టి బొందమ్మలకు 2005-2006లో జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా రూ. 25 వేల నగదు అవార్డు అందుకున్న ఘనత ఈ ప్రతిష్టాన్‌కు దక్కింది.
2010లో ఐఎస్‌ఒ గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న 15 ఖాదీ సంస్థల్లో వావిలాల అతిపెద్దది. మొత్తం రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్‌లో రూ. 3.5 కోట్ల వాటా ఒక్క వావిలాల నుంచే అందుతుండటం గమనార్హం. వావిలాల ఖాదీ సంస్థాన్ పరిధిలో ఐదు చోట్ల వస్త్రాలు తయారు చేస్తుండగా.. 15 చోట్ల ఏర్పాటు చేసిన ఔట్‌లెట్స్ ద్వారా అమ్మకాలు సాగుతున్నాయి. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఖాదీ కమిషన్ నుంచి శుద్ధిచేసిన పత్తిని కొనుగోలు చేసి ఇక్కడ వస్త్రాలు నేస్తున్నారు. ఇక 2009లో ఎక్కువ ఖాదీ ఉత్పత్తులను అందించి ఉత్తమ సంస్థ అవార్డుతో పాటు 2010లో ఐఎస్‌ఒ గుర్తింపు పొందింది. పైగా ఇక్కడ తయారయ్యే కార్పెట్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు మహాత్మా గాంధీ మనుమరాలు తారా భట్టాచార్య కూడా ఈ ఖాదీ భండార్‌ను సందర్శించారు.