- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ముఠాలో ఉన్నది ముగ్గురేనా?
దిశ, కరీంనగర్ బ్యూరో: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన దోపిడీ వ్యవహారంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికత ఆధారంగా ముఠా ఎటువైపుగా వెళ్లిందో తెలుసుకోవడంతో పాటు ఏ ప్రాంతానికి చెందిన వారో కూడా గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులు అందుకున్న కీలక సమాచారంతో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ముఠా సభ్యులెంతమందో..?
అంజన్న ఆలయంలో దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులు ఎంత మందోనన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీలో ముగ్గురు అగంతకులు మాత్రమే కనిపించినప్పటికీ ఆ గ్యాంగుకు చెందిన వారు మరికొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కొంతమంది కొండగట్టు పరిసర ప్రాంతాల్లో మాటు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ గ్యాంగులో కనీసం 8 మంది అయినా ఉండి ఉంటారని భావిస్తున్నారు.
కర్ణాటక గ్యాంగ్..
కొండగట్టులో చోరీకి పాల్పడింది మాత్రం కర్ణాటకకు చెందిన గ్యాంగేనని బీదర్ ప్రాంతంలో ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీయడం ఆరంభించారు. కొండగట్టు సమీపంలోని సీసీ ఫుటేజీని సేకరించడంతో పాటు టవర్ డంప్ సిస్టం ద్వారా అనుమానిత నెంబర్లను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.
ఇదే క్రమంలో పోలీసులకు అందిన ఓ క్లూ ఆధారంగా ఆరా తీయగా నిందితులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించినట్టు సమాచారం. ఈ ముఠా సభ్యుల ఆచూకీ కోసం మూడు స్పెషల్ టీమ్స్ ను శనివారం తెల్లవారు జామునే పోలీసు అధికారులు పంపించినట్లు సమాచారం. చోరీ జరిగిన ఘటనపై జగిత్యాల ఎస్పీ భాస్కర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దోపిడీ ముఠాను పట్టుకునేందుకు పోలీసు యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.
అవి జరగకపోతే...
అయితే శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కొండగట్టుతో పాటు జగిత్యాల జిల్లాలోని మరో మూడు ఆలయాల్లో చోరీ జరిగింది. దీంతో ఒకే ముఠా ఆయా చోట్ల దొంగతనాలకు పాల్పడి ఉంటుందని భావించారు. అయితే కొండగట్టు ఘటనలకు ఇతర ఆలయాల్లో జరిగిన ఘటనలకు పోలిక లేకపోవడంతో వేర్వేరు ముఠాలు అయి ఉంటాయని అంచనా వేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఏకకాలంలో దోపిడీలు జరగనట్లయితే కొండగట్టు దోపిడీ ముఠాను ఇప్పటికే అదుపులోకి తీసుకునేవారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఔట్ పోస్ట్ బలోపేతం..?
మరోవైపు కొండగట్టులో ఔట్ పోస్ట్ పెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఔట్ పోస్టును అప్ గ్రేడ్ చేసి హోంగార్డులతో పాటు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను అలాట్ చేసి ఇన్ చార్జిగా ఎస్సై స్థాయి అధికారిని నియమించాలన్న ప్రతిపాదనలు తయారు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దోపిడీ జరిగిన తరువాత కొండగట్టు ఆలయ అధికారులు కూడా ఈ ఔట్ పోస్టును అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
అయితే తాజాగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ ఔట్ పోస్టును బలోపేతం చేస్తే అన్ని విధాలుగా మంచిదన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.