హస్తంలో మళ్లీ ఫ్లెక్సీ వార్...

by S Gopi |
హస్తంలో మళ్లీ ఫ్లెక్సీ వార్...
X

ఓ వైపు జిల్లాలో పీసీసీ చీఫ్ జోడోయాత్ర సాగుతుంటే మరోవైపు వర్గ విభేదాలతో కోరుట్ల కాంగ్రెస్‌లో ఇంటర్నల్ వార్ నడుస్తోంది. అభిమాన నాయకుడు వస్తున్నాడని కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సొంత పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు చించి వేశారు. దీంతో పార్టీలో ఉన్న వర్గ విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఏకం చేసుకుంటూ ప్రజలను మెప్పించేందుకు రేవంత్ జోడో యాత్ర చేస్తున్నారు. కానీ కొంతమంది ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో చోడో యాత్రను తలపిస్తుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో ఉన్న వర్గ పోరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పాలి.


దిశ, జగిత్యాల ప్రతినిధి: ఓ వైపు జిల్లాలో పీసీసీ చీఫ్ జోడోయాత్ర సాగుతుంటే మరోవైపు వర్గ విభేదాలతో కోరుట్ల కాంగ్రెస్‌లో ఇంటర్నల్ వార్ నడుస్తోంది. అభిమాన నాయకుడు వస్తున్నాడని కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సొంత పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు చించి వేశారు. దీంతో పార్టీలో ఉన్న వర్గ విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఏకం చేసుకుంటూ ప్రజలను మెప్పించేందుకు రేవంత్ జోడో యాత్ర చేస్తున్నారు. కానీ కొంతమంది ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో జోడో యాత్రను తలపిస్తుందని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో ఉన్న వర్గ పోరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పాలి.


మొన్న చొప్పదండిలో...

రేవంత్ రెడ్డి జోడో యాత్రలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని పూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం మాట్లాడారు. అనంతరం ఇదే నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న మరో నాయకుడు నాగి శేఖర్ మైక్ తీసుకుని మాట్లాడుతుండగానే సత్యం తనకేమీ పట్టనట్టుగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఈ ఇరువురి నేతల మధ్య సైలెంట్ వార్ నడుస్తుందనే చర్చలు ఊపందుకున్నాయి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన నాయకుల మధ్య గ్యాప్ ఏర్పడడంతో వచ్చే ఎన్నికల్లో కూడా గతంలోని ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు కలవర పడుతున్నాయి. ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకు నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఎన్ఎస్‌యూఐ నాయకుడు నాగి శేఖర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం నాయకులు చించారు. పూడూర్, నమిలికొండ, గంగాధరలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసినట్లు నాగి శేఖర్ అభిమానులు తెలిపారు. దీంతో యాత్ర టైమ్‌లో నాయకుల మధ్య విభేదాలు నెలకొనడంతో రాష్ట్ర నాయకత్వం అసహనం వ్యక్తం చేసింది.

నేడు కోరుట్లలో...

కోరుట్ల కాంగ్రెస్ పార్టీలోనూ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. యాత్రలో భాగంగా నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్లలో పర్యటిస్తున్న అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సొంత పార్టీలోని మరో వర్గం వారు చించి వేయడంతో కోరుట్లలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. రేవంత్ రాక సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, సుజిత్ రావు, కొమిరెడ్డి కరంలతోపాటు మాజీ జెడ్పీటీసీ భర్త శ్రీనివాసరెడ్డిలు స్వాగతం తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇందులో నర్సింగరావు, సుజిత్ రావుల ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం చించివేశారు. ఇది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారింది. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఇది కాస్త కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో పార్టీ వర్గాలను సీరియస్‌గా మందలించినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఎన్నికలకు పట్టుమని పది నెలల సమయం కూడా లేకపోవడం, ఈ సమయంలో సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన నాయకుల మధ్య వర్గ విభేదాలు పార్టీ అధిష్టానాన్ని పట్టిపీడిస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఫలితాలు చేదుగా వచ్చే అవకాశం ఉండడంతో పరిస్థితులను చక్కదిద్దే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story