ధాన్యాన్ని పాడీ క్లీనర్లతో శుభ్రం చేయాలి

by Sridhar Babu |   ( Updated:2024-11-09 14:31:55.0  )
ధాన్యాన్ని పాడీ క్లీనర్లతో శుభ్రం చేయాలి
X

దిశ, సుల్తానాబాద్ : కొనుగోలు కేంద్రాల వద్ద పాడీక్లీనర్ల ద్వారా ధాన్యాన్ని శుభ్రం చేయాలని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను పరిశీలించారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం భూపతిపూర్, కాట్నపల్లి గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. పెద్దపల్లి పట్టణం ధర్మారం రోడ్డు లోని 18వ వార్డ్ లో ఇంటింటి సర్వే, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని అన్నారు. హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కగా చేయాలన్నారు. ప్రతి రోజు 15 కుటుంబాల వివరాలు సేకరించాలని కోరారు. అనంతరం పెద్దపల్లిలోని మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ల్యాబ్, ఓపీ విభాగాన్ని తనిఖీ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ లు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, తహసీల్దార్ సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సుల్తానాబాద్ ఏపీఎం శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story