Whip Adi Srinivas : సిరిసిల్లకు మంచిరోజులు రాబోతున్నాయి

by Sridhar Babu |
Whip Adi Srinivas : సిరిసిల్లకు మంచిరోజులు రాబోతున్నాయి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అతిత్వరలోనే సిరిసిల్లకు మంచి రోజులు రాబోతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా జౌలి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని షాదీ ఖానా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలోని చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులకు, ఆసాములకు, యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మూడు గంటలకు పైగా చర్చించామని,

ప్రభుత్వం చేనేత, మర మగ్గాల రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృతనిశ్చయంతో ఉందన్నారు. అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నోటితో శుభవార్త వినబోతున్నామని, మంత్రులతో కలిసి ఆయన సిరిసిల్లలో పర్యటించబోతున్నట్లు తెలిపారు. నాడు సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ మారినప్పుడు ఒడిదుడుకులు ఉంటాయని, ప్రభుత్వం ఏర్పడగానే ఎన్నికలు వచ్చాయని, అయినా రెండుసార్లు పెండింగులో ఉన్న బకాయిలు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇప్పటికే నాలుగు కోట్ల పైచిలుకు యారణ్ సబ్సిడీ, త్రిఫ్ట్ పథకం కింద రెండున్నార కోట్ల పైగా ప్రభుత్వం నేతన్నలకు అందించిందన్నారు. 37 మంది యువకులు విదేశాలకు

వెళ్లి కొత్త నైపుణ్యాలు నేర్చుకొని వచ్చి, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టెక్స్టైల్ పార్క్ , అపారల్ పార్కులను పరిశీలించామని, 60 ఎకరాల్లో కొత్త పరిశ్రమల పెట్టుబడులకు అనుమతులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పాత పద్ధతులను అనుసరిస్తూ పోటీ ప్రపంచంలో కొత్త ఉత్పత్తులు, కొత్త ఒరవడులు అనుసరిస్తూ నేతన్నల ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వచ్చే జాతీయ చేనేత దినోత్సవం వరకు కొత్త పుంతలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ దేశంలోనే ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నేత, మరమగ్గాల కార్మికులను సన్మానించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వేలిచాల రాజేందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, మాజీ పవర్లూమ్, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, జౌళి శాఖ జిల్లా అధికారి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed