గడువు ముగిసినా నోరు మెదపరా..? కస్టం మిల్లింగ్ ధాన్యం అప్పగించేందుకు మిల్లర్ల దొడ్డిదారి

by Shiva |
గడువు ముగిసినా నోరు మెదపరా..? కస్టం మిల్లింగ్ ధాన్యం అప్పగించేందుకు మిల్లర్ల దొడ్డిదారి
X

దిశ బ్యూరో, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది మిల్లర్లు సంవత్సరాల తరబడి కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పెండింగ్‌‌లో పెట్టి రూ.కోట్లు ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకుని ఆ డబ్బుతో వ్యాపారాలు చేసుకుని కోట్లకు పడగలెత్తారు. కాగా, గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం మిల్లర్ల ఆగడాలు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆయా మిల్లులను గుర్తిస్తూ వాటిపై యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న మిల్లర్లను గుర్తించి ధాన్యం ప్రభుత్వానికి అప్పగించేందుకు వాటికి చివరి గడువుగా సెప్టెంబర్ 30 వరకు ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టింది. ప్రభుత్వం పెట్టిన గడువు ముగిసినప్పటికీ ఇప్పటి వరకు ఎన్ని మిల్లుల్లో ఎంత ధాన్యం రికవరీ అయింది..? ఇంకా ఎన్ని మిల్లులు ఎంత ధాన్యం ఇవ్వాల్సి ఉంది..? రాష్ట్ర వ్యాప్తంగా జీరో పర్సెంట్‌లో ఎన్ని మిల్లులు ఉన్నాయి.

వంద శాతం టార్గెట్ పూర్తి చేసుకున్న మిల్లులు ఎన్ని అన్నది బ్రహ్మ రహస్యమే. ఇంతకి కస్టమ్ మిల్లింగ్ ధాన్యం అప్పగించని మిల్లులపై అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు..? మిల్లులను వేలం వేసి ఆ మొత్తాన్ని రాబడతారా లేక రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా వదిలేస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మిల్లర్లు సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి మస్కా కొడుతూ.. సాగించిన దందా మరోమారు తెరపైకి వచ్చి ప్రచారం జోరందుకుంది. దీంతో మిల్లర్లు అధికారులను మచ్చిక చేసుకునేందుకు మామూళ్లమత్తులో దించేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందుకు ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చినట్టు ప్రచారం జోరందుకుంది. అయితే, అధికారులు ఈ విషయం‌పై స్పందించకపోవడం ఆరోపణలకు బలం చేకూరుతోంది.

నోరు మెదపని అధికారులు

ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గడువు లోపు తిరిగి ప్రభుత్వానికి మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని అప్పగించాలి. అది నిరంతర ప్రక్రియ.. అంతా అధికారుల పర్యవేక్షణలో కొనసాగాలి. కానీ, గత పదేళ్లలో ఎక్కడ ఇది అమలు కాలేదు. సంవత్సరాల తరబడి ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని తీసుకోవడమే తప్ప తిరిగి అప్పగించే ప్రక్రియ ఎక్కడా సజావుగా జరగలేదనేది జగమెరిగిన సత్యం. అయితే, అందుకు అధికారులు ప్రధాన కారణమనేది కాదనలేని నిజం. కోట్ల రూపాయల ధాన్యాన్ని తీసుకుని వ్యక్తిగత వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్న మిల్లర్లు అందుకు అధికారులను మచ్చిక చేసుకుని మాయ చేసేవారనేది అప్పట్లో బహిరంగ రహస్యమే.

అయితే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ సివిల్ సప్లై శాఖ‌పై దృష్టి సారించింది. జరిగిన తప్పిదాలను గుర్తించిన ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేసేందుకు మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందుకు సెప్టెంబరు 30 చివరి తేదీగా గడువు విధించారు. మిల్లర్లకు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇప్పటి వరకు మిల్లర్ల నుంచి ఎంత ధాన్యం రికవర్ అయింది, ఎంత ధాన్యం పెండింగ్ ఉంది? జిల్లా వ్యాప్తంగా జీరో పర్సెంటేజీలో ఎన్ని మిల్లులు ఉన్నాయి. వంద శాతం పూర్తి చేసిన మిల్లులు ఎన్ని సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాష్ట్ర వ్యాప్తంగా హట్ టాపిక్‌గా మారింది. గడువు ముగిసిన అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారులకు దసరా ఆఫర్

సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించేందుకు ప్రభుత్వం మూడు నెలల క్రింద అవకాశం ఇస్తూ సెప్టెంబరు 30 లోపు అప్పగించేందుకు అవకాశం కల్పించింది. అయినా, మిల్లర్ల నుంచి ఎలాంటి స్పందనలేక పోవడం సివిల్ సప్లై అదికారులకు తలనొప్పిగా మారింది. మిల్లర్లు మాత్రం అధికారులను మచ్చిక చేసుకుని మస్కా కొట్టేందుకు భారీ నజరానా‌తో అధికారులు ఆఫర్ ఇచ్చినట్లు సివిల్ సప్లై శాఖలో ప్రచారం జోరందుకుంది. దసరా సందర్భంగా బంగారు బహుమతులు ఇచ్చి అధికారుల నోరు మూసేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు బంగారు నగలను ఆర్డర్ ఇచ్చి తయారు చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత పదేళ్లుగా ఇదే తంతు కొనసాగడంతో అలవాటు పడిన మిల్లర్లు అధికారులను అడ్డు పెట్టుకుని మరో మారు ప్రభుత్వానికి మస్కా కోట్టే పనిలో నిమగ్నమయినట్లుగా తెలుస్తుంది.

మిల్లర్లు షిప్టింగ్ చీటింగ్ దందాకు యత్నం

ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పజెప్పి అందుకు ఖర్చులను సైతం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ.. ఆ నిబంధనలకు కొంతమంది మిల్లర్లు తిలోదకాలు ఇస్తు అధికారులను మచ్చిక చేసుకోవడం ఆపై అక్రమాలకు తెరలేపడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు అక్రమాలకు అండగా ఉండటంతో అక్రమాలను అధికారికంగానే జరిగాయనేది కాదనలేని నిజం. అదే అదునుగా భావించిన మిల్లర్లు ఆ దందాను అలవాటుగా మార్చుకుని నిబందనలకు తిలోదకాలు ఇస్తు మరో మారు షిప్టింగ్ చీటింగ్ దందాకు దారులు సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Next Story

Most Viewed