రాష్ట్ర వ్యాప్తంగా7,100 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
రాష్ట్ర వ్యాప్తంగా7,100 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్: ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం చర్ల బూత్కూరు, ముగ్దంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యాసంగి పంట ముందుగానే కోతకు వస్తుందని, సీఎం ఆదేశాల మేరకు 15 రోజులు ముందుగానే ధాన్యం కొలుగోలు ప్రారంభించామన్నారు.

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శనివారం నాటికి 420 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.4.15 కోట్లు విలువ చేసే 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రం సంఖ్యను పెంచుతామన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రైతులు నిబంధన మేరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలన్నారు. ఒక్కో గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

దేశంలో వర్షాకాలం, యాసంగి రెండు పంటలు పండిస్తారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాసంకి పంటను కొనుగోలు చేస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్ దేనని అన్నారు. సమైక్య పాలనలో సాగు నీరు లేక సగం భూమి పడావు పెట్టిన రోజులు ఉండేవని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని అన్నారు.

రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో నీళ్లు, యూరియా బస్తాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బుతో సకాలంలో వారి అకౌంట్లలో జమ చేస్తున్నామి తెలిపారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రలు ప్రారంభిస్తున్నామని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వయం చేసుకోవాలని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ. శ్యాంప్రసాద్ లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురమల్ల లలిత, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్వేణి మధు, సర్పంచ్ దుబ్బేట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్, శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed