టీఆర్ఎస్ పాలనలో విద్య వ్యవస్థ నిర్వీర్యం : Jeevan Reddy

by Nagaya |   ( Updated:2022-09-05 14:36:54.0  )
టీఆర్ఎస్ పాలనలో విద్య వ్యవస్థ నిర్వీర్యం : Jeevan Reddy
X

దిశ, జగిత్యాల : టీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ నిర్లక్ష్య వైఖరితో విద్యావ్యవస్థ కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ఉపాధ్యాయుల నియామకాలు, అటు పదోన్నతులు చేపట్టకపోవడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యాధికారుల పోస్టులు 485 ఉండగా, ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే విధులు నిర్వర్తించడం విద్యావ్యవస్థ పట్ల టీఆర్ఎస్ చిత్తశుద్ధికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.

ఉపాధ్యాయ నియామకాల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించినా, ఉపాధ్యాయ నియమకాలు ఎప్పుడు చేపడతారో ప్రభుత్వనికే స్పష్టత లేదని ఆరోపించారు. పాఠశాలల్లో స్కావెంజర్స్ స్వీపర్లను నియమించకపోవడంతో గ్రామపంచాయతీ సిబ్బందిపై భారం పడుతుందని దీంతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది అన్నారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను కొనసాగించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రైవేటు పాఠశాలల టీచర్లు ముందు వరుసలో నిలబడి ఉద్యమించారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇస్తుందని పాఠశాలల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనం వేతనం రూ.I000నుండి 3000 రూపాయల పెంచి ఆరు నెలల గడుస్తున్న నేటికీ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. వెంటనే ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేయాలని, పూర్తిస్థాయిలో బోధనా సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన బోధనా అందించాలని, అప్పుడే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నిజమైన నివాళి అని అన్నారు.

Advertisement

Next Story